పురట్చితలైవి జయలలిత మనకికలేరు

Update: 2016-12-05 19:45 GMT

పురట్చితలైవి మనకికలేరు. విప్లవనాయకిగా , తిరుగులేని పోరాటపటిమ ఉన్న యోధురాలిగా సినీ, రాజకీయ రంగాల్లో కూడా తనకంటూ ప్రత్యేక ముద్ర కలిగి ఉన్న జయలలిత మృత్యువుతో జరిగిన ఆఖరి పోరాటంలో తలవంచారు. జయలలిత మనకిక లేరు, తీవ్రమైన గుండెపోటు కారణంగా మరణించారు అంటూ ఆస్పత్రి వర్గాలు రాత్రి 11.30 గంటలకు ప్రకటించాయి.

తమిళనాడు వ్యాప్తంగా విషాదఛాయలు అలముకున్నాయి. జయలలితకు చికిత్స జరుగుతున్న సమయంలోనే ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందోనన్న భయంలో ఓ అభిమాని గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. తమిళనాడు అంతటా ఆమె అభిమానులు పెద్దపెట్టున రోదిస్తున్నారు. విషాదంలో మునిగిపోయారు. కాసేపట్లో జయలలిత మృతదేహాన్ని అపోలో ఆస్పత్రినుంచి చెన్నయ్ లోని రాజాజీ హాల్ కు తరలించనున్నారు. ప్రజల సందర్శనార్థం అక్కడ ఉంచుతారు. తమిళనాడులో ఏడు రోజులు సంతాపదినాలుగా ప్రకటించారు. 74 రోజులుగా మృత్యువుతో పోరాడిన జయలలిత చివరకు కన్నుమూశారు. ఆమె వారసుడిగా తమిళనాడు ముఖ్యమంత్రిగా గతంలో ఆమె నియమించిన పన్నీర్ సెల్వంనే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు.

ద్రవిడ రాజకీయాల్లో ఒక తిరుగులేని శక్తిగా ఎదిగిన, కేంద్ర ప్రభుత్వాలను కూడా ఖాతరు చేయకుండా ఉండే ధీశాలిగా రకరకాలుగా తన రాజకీయ దృఢత్వాన్ని నిరూపించుకున్న మేరునగ సమానమైన ఒక నాయకురాలు ఇక చరిత్రలో అంతర్భాగం అయిపోయిందని అందరూ సంతాపాలు వ్యక్తం చేస్తున్నారు.

Similar News