పాపం ఓవైసీ.....

Update: 2017-03-12 09:30 GMT

యూపీలో బోణి కొట్టాలని ఉవ్విళ్లూరిని ఎంఐఎం పార్టీకి నిరాశ తప్పలేదు. అసదుద్దీన్‌ ఒవైసీ నేతృత్వంలోని ఆలిండియా మజ్లిస్‌ ఇతేహాదుల్‌ ముస్లిమీన్‌ పార్టీకి ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భంగపాటు తప్పలేదు. యూపీ ఎన్నికల్లో 38 స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థులు పోటీ చేశారు. అయితే ఒక్క చోట కూడా ఆ పార్టీ బోణీ కొట్టలేదు. ఈ ఎన్నికల్లో సత్తా చాటి ఉత్తరప్రదేశ్‌లోనూ తమ పార్టీని విస్తరించుకోవాలన్న ఒవైసీ కలలు నెరవేరలేదు. ఎంఐఎం నుంచి కచ్చితంగా విజయం సాధిస్తారని భావించిన జియావుర్‌ రెహ్మాన్‌ బర్క్‌ కూడా ఓటమి పాలయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో భారీగా ముస్లిం ఓటర్లు ఉండటంతో వారిని ఆకట్టుకునేందుకు ఒవైసీ తీవ్రంగా ప్రయత్నించారు. యూపీలో ముమ్మరంగా ప్రచారం చేసిన ఆయన.. ప్రచారపర్వంలో బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఘాటైన విమర్శలతో విరుచుకుపడ్డారు. అయినప్పటికీ ఆయన పెద్దగా ప్రభావం చూపలేకపోయారని తాజా ఫలితాలు చాటుతున్నాయి. అయితే, తాము ఇంకా యుద్ధం నుంచి తప్పుకోలేదని, మున్ముందు మరింత తీవ్రంగా ఎన్నికల్లో పోరాడుతామని ఒవైసీ స్పష్టం చేశారు.యూపీ ఎన్నికల తర్వాత మోదీని పొగుడుతూ ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించడంపై అసహనం వ్యక్తం చేశారు. యుద్ధం మొదలుకాకముందే పారిపోవాలనేవిధంగా ఒమర్‌ అబ్దుల్లా వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన విమర్శించారు.

Similar News