పాక్‌ను హెచ్చరించడానికి సరైన వేదిక ఎక్కడ?

Update: 2016-09-24 23:04 GMT

నిజానికి ప్రధాని స్థాయిలోని నాయకుడు ఎక్కడనుంచి మాట్లాడారు అనే విషయానికంటె.. ఏం మాట్లాడారు అనే అంశానికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఎక్కడనుంచి మాట్లాడారు అనే అంశం కూడా ప్రధానంగానే చర్చకు వస్తుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. ఉరీలో భారత్‌పై పాకిస్తాన్‌ ముష్కర మూకల దాడులు జరిగిన నేపథ్యంలో.. ప్రధాని మోదీ పాకిస్తాన్‌కు చేసిన హెచ్చరికలు ఎక్కడినుంచి ఉండాలని జనం ఆశిస్తారు. సాధారణంగా ఇలాంటి ఉగ్రదాడులు జరిగిన వెంటనే కాకపోయినా, ఒకరోజు వ్యవధి తర్వాత.. ప్రధాని వంటి నాయకులు ఉరీకే వెళ్లి.. అక్కడ మిగిలి ఉన్న సైనికుల్లో ఆత్మవిశ్వాసం నింపుతూ.. అక్కడినుంచి పొరుగుదేశాన్ని హెచ్చరించాలని అంతా అనుకుంటారు. కానీ పాక్‌ను ఒంటరిచేస్తాం, ఆసియాలో రక్తపాతానికి పాక్‌ కుట్ర చేస్తున్నది, ప్రపంచమంతా ఉగ్రవాదం వ్యాపింపచేస్తోంది అంటూ.. ప్రధాని మోదీ దేశంలో ఇటు చివర్న కేరళలోని కోజికోడ్‌ నుంచి సెలవిచ్చారు.

ఉరీలో చేసిన దాడుల గురించి పాకిస్తాన్‌ ను హెచ్చరించడానికి, ఆ ప్రాంతానికి 3500 కిలోమీటర్ల దిగువన ఉన్న కోజికోడ్‌ వరకు వెళ్లి.. మోదీ చాలా సాహసంతో హెచ్చరించారంటూ ఆయన మీద సోషల్‌ మీడియాలో సెటైర్లు వ్యాప్తి చెందుతున్నాయి.

మోదీలోని సాహసి.. ఏ అంతర్జాతీయ వేదిక మీదినుంచి గానీ.. ఉరీలోని సైకిన స్థావరాల పర్యటన లో భాగంగా గానీ ఇలాంటి హెచ్చరిక చేసి ఉంటే చాలా గౌరవంగా ఉండేదని.. అసలు ఉగ్రవాదం ఊసు ఉండని దక్షిణాది కోజికోడ్‌ నుంచి ఎక్కడో దూరంగా ఉన్న పాక్‌ను హెచ్చరించడం ఏంటని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ముందే చెప్పుకున్నట్లు ప్రధాని స్థాయిలో ఏం చెప్పారన్నదే ప్రధానం.. కానీ కొన్ని సందర్భాల్లో ఎక్కడినుంచి చెప్పారన్నది కూడా ప్రధానమే అని మోదీ తెలుసుకోవాలి.

Similar News