పవన్ రాక వల్ల ఎవరికీ లాభం!

Update: 2016-04-13 00:07 GMT

పవన్ ఇక సినిమాల‌కు స్వ‌స్తి చెప్పి ఫుల్ టైం రాజ‌కీయ వేత్త‌గా 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించేశాడు. ఇప్ప‌టివ‌ర‌కూ రెండు రాజ‌కీయ‌పార్టీలే ఏపీలో ఉన్నాయి. కాంగ్రెస్ ఉన్నా.. ఆ పార్టీకి ప్రాధాన్య‌త లేదు! మ‌రి ఇటువంటి స‌మ‌యంలో 2019లో 'ప‌వ‌ర్‌' ఎవ‌రిది? ఎవ‌రు అధికారంలోకి వ‌స్తారు? ప‌వ‌ర్ స్టార్ పోటీచేస్తే ఎవ‌రికి లాభం? ఎవ‌రికి న‌ష్టం అనే ప్ర‌శ్న‌లు ఇప్ప‌టినుంచే మొద‌ల‌య్యాయి. అయితే జ‌గ‌న్ 'సీఎం' క‌ల‌కు ఒక‌సారి గండి కొట్టిన ప‌వ‌న్‌.. ఇప్పుడు పూర్తిస్థాయిలో బ‌రిలోకి దిగుతుండ‌టంతో మరొకసారి జగన్ కి ఎదురు దెబ్బ తగిలేటట్లు ఉంది.

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కాపుల‌కు ఏపీలో బ‌లం పెరిగింది. 2014 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ప్రచారం టీడీపీ+బీజేపీకి బాగా క‌లిసొచ్చింది. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని కాపుల‌ను తమ వైపున‌కు తిప్పుకునేందుకు చంద్ర‌బాబు ర‌క‌ర‌కాల ఎత్తులు వేస్తున్నారు. కాపులను బీసీల్లో చేర్చటంతో పాటు పలు కార్యక్రమాలు చేస్తానని బాబు హామీ ఇచ్చారు. వీటి అమలులో జాప్యం జరుగుతుండటంతో కాపులను తన వైపు తిప్పుకునేందుకు ప్రతిపక్ష నేత జగన్ శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది 2019లో త‌మ‌కు లాభిస్తుంద‌ని ఆశ‌ప‌డుతున్నారు జ‌గ‌న్‌.

జ‌గ‌న్ ఆశ‌లు ఇలా ఉంటే ఇఫ్పుడు పవన్ ప్రవేశంతో ‘లెక్కలు’ తారుమారు అయ్యే పరిస్థితి కన్పిస్తోంది. రెండు వర్గాల ఓట్లు చీలిపోతాయి. ఇదివ‌ర‌కు చంద్ర‌బాబును వ్య‌తిరేకిస్తే జ‌గ‌న్‌కు ఓట్లేసేవారు. అలాగే జగన్ కి వ్యతిరేఖం గా ఓట్లు వేసి చంద్ర బాబుని సిఎమ్ ని చేసారు. 2019లో ఆ ప‌రిస్థితి ఉంటుందా ? లేదా అన్న‌ది చెప్ప‌లేం. అలాగే ప్ర‌భుత్వం ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌లేకపోయింద‌ని, దీంతో మ‌రో రెండేళ్ల‌లో ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. దీనివ‌ల్ల తాను సీఎం కుర్చీలో కూర్చోవడం ఇక ఖాయమేన‌ని ఊహ‌ల ప‌ల్ల‌కిలో ఎగురుతున్నారు. అందుకే 'రెండేళ్ల‌లో మ‌న ప్ర‌భుత్వం వస్తుంది. నేను సీఎం అయిపోతాను. మీ క‌ష్టాలు తీరిపోతాయి' అంటూ చెబుతున్నారు. కానీ ప‌వ‌న్ ఎంట్రీతో జ‌గ‌న్ ఆశ‌ల‌కు గండి ప‌డొచ్చ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. టీడీపీ, వైసీపీల‌కు ప‌వ‌న్ ప్ర‌త్యామ్నాయంగా రాబోతున్నాడు. ఇది ఎవ‌రికి మేలు అనేది కాల‌మే నిర్ణ‌యిస్తుందంటున్నారు.

Similar News