పవన్ ముందున్న టార్గెట్ ఇదే

Update: 2017-02-22 04:46 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తున్నారు. రాజకీయ పార్టీగా జనసేనను తీసుకొచ్చిన పవన్ ఇప్పుడు జనంలోకి తీసుకెళ్లేందుకు సిద్దమవుతున్నారు. ఇందుకోసం పార్టీ కార్యాలయాలను త్వరలో ప్రారంభించాలని ఆయన భావిస్తున్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాల్లో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం కార్యాలయాలను జనసేన కార్యకర్తలు చూస్తున్నారు. పవన్ ఈ కార్యాలయాల్లో ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను, వినతులను స్వీకరించనున్నారు. వాటి పరిష్కారానికి అక్కడికక్కడే జనసేన కార్యకర్తలు ఆందోళన చేపడతారు. చిన్న సమస్యలైతే లోకల్ పార్టీ చూసుకుంటుంది. అలాగే అది రాష్ట్ర వ్యాప్త సమస్య అయితే జనసేనాని రంగంలోకి దిగి ఆందోళన చేపడతారని జనసేన పార్టీ వర్గాలు వెల్లడించాయి.

వచ్చే ఏడాది నుంచి పూర్తిస్థాయిలో...

ఇప్పటికే తాను 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. యువనేతలకే ఈసారి టిక్కెట్లు దక్కుతాయని ఆయన పరోక్షంగా చెప్పారు. నిస్వార్థంగా పనిచేస్తూ, ప్రజాసేవే ఆశయంగా ఉన్నవారినే పవన్ ఎంపిక చేసుకోనున్నారు. అందుకోసం పార్టీ కార్యాలయాలు బాగా ఉపకరిస్తాయని ఆయన అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఏడాదికి పూర్తి స్థాయిలో జనసేనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పవన్ భావిస్తున్నారు. హైదరాబాద్ కార్యాలయంతో పాటు విజయవాడ, విశాఖ, తిరుపతిలో కార్యాలయాలను తెరవనున్నట్లు చెబుతున్నారు. 2018 నాటికి తాను అన్ని సినిమాల షూటింగ్ లను కంప్లీట్ చేసుకుని వచ్చే ఏడాది నుంచే పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రావాలని పవన్ భావిస్తున్నారు.

Similar News