పవన్ బిజెపి లో చేరడం ఉత్తమం!

Update: 2016-04-13 00:06 GMT

అప్పట్లో భాజపా, తెదేపా కూటమికి మద్దతిచ్చిన పవన్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర విభజనపై కూడా తీవ్రంగా స్పందించిన పవన్ తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు న్యాయం జరగాలంటే భాజపా, తెదేపా కూటమిలను గెలిపించాలని ప్రచారం కూడా చేశారు. అప్పటి నుంచి పవన్ భాజపా, తెదేపా కూటమికి మద్దతిస్తూ వచ్చారు, కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం అధికార పార్టీ రైతులపై చేస్తున్న దౌర్జన్యాన్ని ప్రశ్నించేందుకు తుళ్ళూరు వెళ్ళిన పవన్ తెదేపా పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే రైతులకు అండగా నిలుస్తానని భరోసా కల్పించారు.ఇటీవల కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం తునిలో నిర్వహించిన గర్జన సభ సందర్భంగా హింస చెలరేగడం, రైలుకు నిప్పు పెట్టడం తదితర ఘటనల తర్వాత మరోసారి తెరపైకి వచ్చిన పవన్ కుల రాజకీయాలకు తాను దూరమని స్పష్టం చేశారు. వాస్తవానికి తుని ఘటన సందర్భంగా పవన్ కేరళలో షూటింగ్ లో ఉన్నారు. హింస చెలరేగిందన్న విషయం తెలుసుకున్న పవన్ షూటింగ్ ను రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్ వచ్చారు. అయితే పవన్ దీనిపై తీవ్రంగా స్పందిస్తారని అందరూ భావించినప్పటికీ మీడియా సమావేశంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. భాజపా యువమోర్చ రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, భాజపా భావాలకూ పవన్ భావసారూప్యం దగ్గరగా ఉంది కాబట్టి కొత్త పార్టీ పెట్టడం కంటే భాజపాలో చేరి ప్రజలకు మేలు చేస్తే బాగుంటుందన్నారు. తెదేపా ఎమ్మెల్సీ, సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు స్పందిస్తూ ప్రజాభీష్టం మేరకు పని చేయాల్సి ఉంటుందని, ఆ కోవలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పని చేస్తుందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ స్పందిస్తూ పవన్ ఏం మాట్లాడుతారు, ఏం చేస్తారనేది ఎవరికీ అర్థం కాదని, రాజధాని భూములను లాక్కున్న ప్రభుత్వంపై పోరాటం చేస్తానని చెప్పి తోక ముడిచారని, కాపు ఉద్యమం సందర్భంగా కూడా పవన్ ఇదే విధంగా వ్యవహరించారని, ఆయన మొత్తంగా భాజపా, తెదేపాలకే అనుకూలంగా పని చేస్తారని, పార్టీ పెట్టినా ఆ పార్టీలకు తొత్తుగా మాత్రమే ఉంటుంది తప్ప కొత్తదనమేదీ ఉండదన్నారు.

Similar News