పవన్ కు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే...?

Update: 2017-11-11 09:30 GMT

జనసేన పార్టీనిర్మాణ కార్యక్రమాలపై దృష్టిపెడుతుండటంతో తెలుగుదేశం పార్టీకూడా అప్రమత్తమయింది. జనసేన ఇప్పటికే పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ఇన్ ఛార్జులనునియమించడానికి కసరత్తులు ప్రారంభించింది. డిసెంబర్ మొదటి వారానికల్లా ఈ ఎంపిక ప్రక్రియను పూర్తిచేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఆయన డిసెంబర్ 7వ తేదీ నుంచి సినిమాల నుంచి ఫ్రీ అవుతున్నారు. దీంతో ఆయన రాజకీయాలపై దృష్టి పెట్టనున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలకు కూడా వెళ్లనున్నారు. ఈనేపథ్యంలో జనసేన ఎంపిక కార్యక్రమానికి విపరీతంగా రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా కొత్తవారికే సీట్లు ఇస్తామని చెప్పడంతో యువత ప్రధానంగా జనసేన వైపు చూస్తోంది. జనసేన పార్టీ ఖచ్చితంగా 2019 ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయం. యువత ఓట్లు కీలకంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇటీవల జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలోనూ జనసేన అంశాన్ని ప్రస్తావించారు.

సీట్లు త్యాగం చేయాల్సి ఉంటుందని....

జనసేన రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో ప్రభావం చూపకపోయినా ఉభయ గోదావరి జిల్లాల్లో గెలుపోటములను ఖచ్చితంగా నిర్దేశిస్తుందన్న సంగతి చంద్రబాబుకు తెలియంది కాదు. అందుకోసమే ఎమ్మెల్యేల సమావేశంలో వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర కంటే ఎక్కువగా జనసేన పార్టీ విషయంలోనే ఎక్కువ ఆందోళన వ్యక్తమయినట్లు తెలిసింది. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో గత ఎన్నికల్లో కాకినాడ ఎంపీ స్థానం టీడీపీ కి దక్కదని ఆ పార్టీ నేతలే అంచనా వేశారు. అయితే పవన్ ప్రభావం స్పష్టంగా కన్పించింది. దీంతో పవన్ ప్రభావం ఎక్కువగా ఉండే తూర్పు, పశ్చిమ గోదావరిజిల్లాల్లో ఎక్కువ అసెంబ్లీ సీట్లు ఉండటంతో పవన్ పై ఎవరూ ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని చంద్రబాబు సీరియస్ గా చెప్పినట్లు తెలిసింది. పవన్ విషయంలో ఆచితూచి మాట్లాడాలని, జనసేన విషయాన్ని తనకు వదిలేయాలని చంద్రబాబు స్పష్టంగా చెప్పినట్లు తెలిసింది. ఈరెండు జిల్లాలో కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి ఉంటుందని కూడా ఎమ్మెల్యేలకు పరోక్షంగా చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. సీట్లు దక్కని ఎమ్మెల్యేలకు తాను శాసనమండలికి పంపిస్తానని కూడా హామీ ఇచ్చినట్లు సమాచారం. మొత్తం మీద చంద్రబాబు పవన్ తో పొత్తుకే రెడీ అయిపోయారన్న మాట. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ సమావేశంలో బీజేపీ ప్రస్తావనే రాకపోవడం.

Similar News