పవన్ కల్యాణ్ : ఏలూరు ఓటర్!!

Update: 2016-10-31 13:05 GMT

జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్ తన పార్టీ రాజకీయ ప్రస్థానానికి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ నే ఎంచుకుంటున్నారు. తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు పరిధిలో ఓటరుగా నమోదు కావాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ కు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పరిధిలో ఓటు హక్కు ఉంది. దీన్ని రద్దు చేసుకుని కొత్తగా ఏలూరు నియోజకవర్గం నుంచి ఓటరుగా నమోదు కావాలని పవన్ నిర్ణయించుకోవడం విశేషం.

పవన్ కల్యాణ్ జనసేన పార్టీని ప్రకటించి.. మూడేళ్లు అవుతున్నప్పటికీ.. ఇటీవలి కాలంలోనే కాస్త చురుగ్గా కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే రాజకీయ కార్యకలాపాలు అన్నీ ఆంధ్రప్రదేశ్ ఫోకస్ తోనే సాగుతుండడం విశేషం. తెలంగాణలో సభలే పెట్టలేదు సరికదా.. తెలంగాణ సమస్యల ప్రస్తావన కూడా ఆయన తీసుకురావడం లేదు. దీంతో పవన్ కల్యాణ్ కు ఏపీ రాజకీయాల మీద మాత్రమే మక్కువ ఉన్నదనే సంగతి తేలిపోతోంది.

ఇలాంటి నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సోమవారం హైదరాబాదుకు వచ్చి పవన్ కల్యాణ్ ను కలిశారు. తమ జిల్లానుంచి ఓటరుగా నమోదు కావాలని వారు అభ్యర్థించారు. వారి అభ్యర్థనను మన్నించిన పవన్ కల్యాణ్ జిల్లా కేంద్రమైన ఏలూరునుంచి ఓటరుగా నమోదు కావడానికి ఓకే చెప్పినట్టుగా పార్టీ ప్రకటన విడుదల చేసింది.

ఏలూరులో తనకు ఒక నివాసభవనం కూడా చూడాల్సింది అక్కడి పార్టీ శ్రేణులకు పవన్ కల్యాణ్ పురమాయించినట్లుగా ప్రకటనలో పేర్కొన్నారు. ఓటరుగా నమోదు కావడానికి ఏర్పాట్లు చూడాలని పార్టీ కేడర్ ను పవన్ పురమాయించారు.

Similar News