పంపకాలు మొదలెట్టిన చంద్రబాబు

Update: 2016-09-29 16:16 GMT

పరిపాలన చేపట్టిన దాదాపు రెండున్నరేళ్ల తరువాత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొన్ని కీలకమైన నామినేటెడ్ పోస్టులను గురువారం నాడు భర్తీ చేశారు. అధికారంలోకి వచ్చినప్పటినుంచి పార్టీ కార్యకర్తలు, నాయకులు పదవుల కోసం అర్రులు చాస్తూ ఉండగా.. ఇన్నాళ్లు మీనమేషాలు లెక్కిస్తూ వచ్చిన చంద్రబాబు ఇన్నాళ్లకు మూడు పదవులను ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ జయరామిరెడ్డి నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. నిజానికి ఈ పోస్టు కోసం చాలా పెద్ద ఎత్తున ఒత్తిళ్లు ఉన్నప్పటికీ చంద్రబాబు చిట్టచివరికి జయరామిరెడ్డి వైపు మొగ్గారు.

అలాగే విజయవాడలోని దుర్గామల్లేశ్వరస్వామి వారి ఆలయానికి ట్రస్టు బోర్డు ఛైర్మన్ గా యలమంచిలి గౌరంగబాబు ను నియమించారు. కనీన వేతనాల సలహా మండలి ఛైర్మన్ పదవిని డొక్కా మాణిక్య వరప్రసాద్ కు కట్టబెట్టారు.

వీరిలో తొలి ఇద్దరూ స్వతహాగా తెలుగుదేశం కార్యకర్తలే కాగా, వేతనాల మండలి ఛైర్మన్ పదవి దక్కించుకున్న డొక్కా మాణిక్యవరప్రసాద్ మాత్రం కాంగ్రెస్ పార్టీనుంచి ఫిరాయించి వచ్చిన నాయకుడు. కాంగ్రెస్ హయాంలో ఆయన మంత్రిగా పనిచేశారు.

రాష్ట్రంలో ఇంకా బోలెడు నామినేటెడ్ పోస్టులు ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నాయి. తమ పార్టీ అధినేత సత్వరం వాటిని భర్తీ చేస్తే బాగుంటుందని, ఇంకా ప్రభుత్వం పదవీ కాలం కేవలం రెండున్నరేళ్లు మాత్రమే ఉన్న నేపథ్యంలో కాలయాపన తగదని పలువురు నాయకులు అభిప్రాయపడుతున్నారు.

Similar News