పంజాబ్ లో ఓటుంటే అమెరికాలో చోటున్నట్లే

Update: 2017-01-25 23:33 GMT

ఎన్నికల్లో విజయం సాధించేందుకు పార్టీలు పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కావు. అలివి మాలిన వాగ్దానాలు, సాధ్యంకాని హామీలను ఇచ్చేస్తున్నాయి. ఉచితంగా ల్యాప్ టాప్ లు, స్మార్ట్ ఫోన్లు ఇస్తామని చెబుతూ యువతను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. వీటన్నింటికీ మించి ఓ పార్టీ ఊహించని బంపర్ ఆఫర్ ఆ రాష్ట్ర ఓటర్లకు ఇచ్చేసింది. అదేంటో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు.

పంజాబ్ లో హోరాహోరీ పోరు జరుగుతోంది. త్రిముఖ పోటీ జరుగుతున్న ఈ రాష్ట్రంలో శిరోమణి అకాళీదళ్ పార్టీ విడుదల చేసిన మ్యానిఫేస్టోను చూస్తే ప్రతి ఒక్కరూ నోరెళ్ల బెట్టాల్సిందే. అకాలీదళ్ కు ఓటేస్తే ఎంపిక చేసిన దేశాల్లో ఉచితంగా భూములను రైతులకు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది. అదీ ఎక్కడో కాదండీ.. అమెరికాలోనట. కెనడాలో నట. అమెరికా, కెనాడా దేశాల్లో లక్షల ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు ఉచితంగా భూమిని పంపిణీ చేస్తామని శిరోమణి అకాళీదళ్ హామీ ఇచ్చేసింది. పైగా భూములు ఉచితంగా ఇవ్వడమే కాదు.. ఆ దేశాలకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు తామే దగ్గరుండి చేస్తామని చెప్పేసింది. అక్కడ శాశ్వతంగా ఉండాలన్నా కూడా సహకరిస్తామని ఊదరగొట్టేసింది. విదేశాల్లో భూములు కొనిస్తామని చెప్పటం దేశ రాజకీయ చరిత్రలో ఇదే తొలిసారి అని చెబుతున్నారు. మరి శాశ్వతంగా ఓటర్లను అక్కడకు పంపిస్తే మరి వచ్చే ఎన్నికల్లో ఎలాగో ఆ పార్టీ చెప్పలేదు. ఇదండీ సంగతి. అధికారం కోసం ఎన్ని అడ్డదారులు తొక్కాలో..అన్నీ వెతుక్కుంటున్నాయి పొలిటికల్ పార్టీలు. ఈ హామీని అక్కడి ప్రజలు సీరియస్ గా తీసుకోలేదట. నవ్వుకుంటున్నారట. నవ్వుకోరు మరీ.

Similar News