నోటు కష్టాలకు చెక్ పెడుతున్న చంద్రబాబు

Update: 2016-11-21 17:35 GMT

రోజువారీగా నోటు కష్టాలను సమీక్షిస్తూ వాటిని దూరం చేయడానికి ప్రయత్నిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు... కొత్తగా సోమవారం నాడు బ్యాంకర్ల సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు.

సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులు తమ బకాయిలును పాత రూ. 500, రూ. 1000 నోట్లతో చెల్లించుకునేలా వెసులుబాటు ఇవ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ప్రత్యేక సమావేశంలో ఆయన తీర్మానించారు. అలాగే రైతుల రుణాల రీషెడ్యూల్ 2017 జూన్ 30 వరకు పొడగించాల్సిందిగా కేంద్రాన్ని, ఆర్బీఐని కోరాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశం నిర్ణయించింది. సోమవారం విజయవాడలో జరిగిన ఈ సమావేశంలో నోట్ల రద్దు, కరువుతో తలెత్తిన పరిస్టితులు-తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. డిసెంబర్ 30 వరకు రూపే కార్డుతో జరిపే లావాదేవీలకు ఎలాంటి సేవా రుసుములు వసూలు చేయకూడదని నిర్ణయించింది.

వచ్చే నెలాఖరు వరకు వీసా, మాస్టర్ కార్డులపై వసూలు చేసే చార్జీలను కూడా వ్యాపారులే భరించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అన్నారు. ఈ చార్జీల భారం నుంచి 40 రోజులు మినహాయింపు ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరతామన్నారు. అలాగే ఇ-పాస్ మిషన్లకు అద్దె వసూలు చేయొద్దని స్పష్టం చేశారు. ఏపీఎస్‌ఆర్టీసీ, వాణిజ్యపన్నులు, విద్యుత్ శాఖ, మార్కెట్ యార్డ్‌లు ఇలా వీలైన ప్రతి చోట ఇ-పాస్ మిషన్లు ద్వారా నగదు రహితంగా సేవలు అందిస్తామని పేర్కొన్న ముఖ్యమంత్రి జనవరి ఒకటి నుంచి అన్ని శాఖల్లోనూ ఆన్‌లైన్ లావాదేవీలను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.

మొత్తం రాష్ట్రంలో వున్న 79,09,626 జన్ ధన్ యోజన ఖాతాలు వుండగా ఈ నెల తొమ్మిది నాటికి రూ. 908.56 కోట్ల నగదు వున్నట్టు ముఖ్యమంత్రికి బ్యాంకింగ్ అధికారులు వివరించారు. వీటిలో 77.59% ఖాతాలను ఆధార్ అనుసంధానించామని చెప్పారు. ఇప్పటివరకు 66,37,402 జన్‌ ధన్ యోజన ఖాతాలకు రూపే కార్డుల జారీ పూర్తి కాగా, ఇందులో కేవలం 34.57% కార్డులు మాత్రమే వినియోగంలో వున్నట్టు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రంలో మొత్తం 8,036 ఏటీఎంలకు గాను 5,900 ఏటీఎంల ద్వారా నగదు లావాదేవీలు జరుగుతున్నాయని, రూ. 2 వేల నోట్లకు అనుగుణంగా 1,577 ఏటీఎంలలో మార్పులు తెచ్చామని తెలిపారు.

రూపే కార్డులు వున్నా వాటిని చాలామంది వినియోగించకపోవడంపై స్పందించిన ముఖ్యమంత్రి అందరికీ నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించాల్సిందిగా బ్యాంకర్లకు సూచించారు. జన్ ధన్ యోజన ఖాతాలు తెరవని పేదలందరితో త్వరితగతిన కొత్త ఖాతాలు తెరవాలని, ఇంకా నూరు శాతం రూపే కార్డుల పంపిణీ జరగాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం వున్న జన్ ధన్ ఖాతాలు అన్నింటిని వినియోగంలోకి తీసుకురావాలని, కార్డులను పోగొట్టుకున్నవారికి తక్షణం డూప్లికేట్ కార్డులను అందించాలని చెప్పారు.

నోట్లు రద్దయి 13 రోజులు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాకపోవడం సరికాదన్న ముఖ్యమంత్రి చిన్ననోట్లు రానంత వరకు ఈ సమస్య కొనసాగుతూనే వుంటుందన్నారు. అప్పటివరకు ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యతిరేకత వస్తుందని బ్యాంకర్లతో చెప్పారు. క్లిష్ట పరిస్థితుల్లో కలసికట్టుగా వ్యవహరించకుంటే ప్రజలకు ప్రభుత్వంపైనా, అనుబంధ వ్యవస్థలపైనా నమ్మకం పోతుందన్నారు. ప్రజలు ఇబ్బందులు పడేలా ఏ వ్యవస్థ వ్యవహరించినా తాను ఉపేక్షించేది లేదన్నారు.

కరెన్సీ చెస్ట్‌లను సమర్ధవంతంగా నిర్వహించడంతో పాటు, రియల్‌టైమ్‌లో డేటాను సేకరించగలగినప్పుడే ప్రస్తుతం నెలకొన్న సమస్య పరిష్కారానికి ఎటువంటి చర్యలు చేపట్టవచ్చో అంచనా వేసే ఆస్కారం వుంటుందని ముఖ్యమంత్రి అన్నారు.

బ్యాంకు ఖాతాల్లో జమ అయిన నగదుకు అనుగుణంగా, నగదు విత్‌డ్రా చేసుకునేలా సరిపడా నోట్లను అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత బ్యాంకర్లదేనని ముఖ్యమంత్రి అన్నారు. ఇందుకోసం కేంద్రం, ఆర్బీఐపై ఒత్తిడి తేవాలన్నారు. నగదు రహిత లావాదేవీలతో నోట్ల కొరత సమస్యను చాలావరకు అధిగమించవచ్చన్నారు. ఇ-పాస్ మిషన్, మొబైల్-నెట్ బ్యాంకింగ్ లావాదేవీలకు అదనపు చార్జీలు వసూలు చేయడంతో నగదు రహిత లావాదేవీలకు స్పందన తక్కువగా ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

80% సబ్సిడీపై ఇ-పాస్ మిషన్లను చిరువ్యాపారులకు అందించడంతో సహా, మొబైల్-నెట్ బ్యాంకింగ్ వంటి ఆన్‌లైన్ లావాదేవీలకు చార్జీలు ఎత్తివేసి ప్రోత్సాహకాలు ఇచ్చినప్పుడే నోట్ల కొరత సమస్యకు ముగింపుపలకొచ్చని ముఖ్యమంత్రి చెప్పారు.

రాష్ట్రంలో ఆర్ధిక లావాదేవీలు నిలిచిపోకుండా చూసేందుకు ఆన్‌లైన్ లావాదేవీలకు అధిక ప్రాధన్యత ఇవ్వాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. నోట్ల రద్దుతో చిరు వ్యాపారులు నష్టపోకుండా జిల్లాకు రూ. 2 కోట్ల చొప్పున మొత్తం రూ. 26 కోట్లు విడుదల చేస్తున్నట్టు ముఖ్యమంత్రి సమావేశంలో ప్రకటించారు.

Similar News