నాగార్జున సీఎం కేసీఆర్‌ను కలవడంలో మతలబు ఏమిటి?

Update: 2016-11-14 12:10 GMT

ముఖ్యమంత్రి కేసీఆర్ ను సోమవారం నాడు ఇద్దరు సెలబ్రిటీలు కలిశారు. ఒకరు కేంద్రమంత్రి దత్తాత్రేయ మరొకరు సినీహీరో నాగార్జున. దత్తాత్రేయ కలవడానికి సంబంధించి స్పష్టమైన కారణం ఉంది. తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ ఆహ్వానం ఇవ్వడానికి దత్తన్న కేసీఆర్ వద్దకు వెళ్లారు. నోట్ల రద్దు వలన రాష్ట్రప్రభుత్వాల ఆదాయాలు పడిపోయాయంటూ కేసీఆర్ వెల్లడించిన అభిప్రాయాలపై కొన్ని రోజుల కిందట దత్తన్న విభేదించినప్పటికీ.. ఇది కేవలం శుభకార్య ఆహ్వానం మాత్రమే గనుక.. రాజకీయ చర్చలు లేకుండా వారి భేటీ ముగిసింది.

అయితే.. హీరో నాగార్జున సీఎం కేసీఆర్ ను కలవడం అనేది చాలా రకాల అనుమానాలు, చర్చలకు దారితీస్తోంది. నోట్ల రద్దు నేపథ్యంలో రాష్ట్రంలో మారుతున్న పరిణామాలకు నాగార్జున వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలవడానికి ఏమైనా లింకు ఉన్నదా అనే దిశగానే చాలా మంది ఊహాగానాలు చేస్తున్నారు. అయితే నాగార్జున కూడా తన కుమారుడి నిశ్చితార్థ మహోత్సవానికి సీఎం కేసీఆర్ ను ఆహ్వానించడానికే కలిశారని కూడా వార్తలు వస్తున్నాయి.

అయితే నాగార్జున రాష్ట్రప్రభుత్వంతో చక్కబెట్టుకోవాల్సిన పనులు కూడా కొన్ని ఉన్నాయి. మాధాపూర్ లో ఆయనకు ఉన్న ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి భూ వివాదం ఉంది. దీని రెగ్యులరైజేషన్ కు కూడా జీహెచ్ ఎంసీ అనుమతించలేదు. అయితే ప్రస్తుతం రెగ్యులరైజేషన్ కు అనుమతించిన అందరినుంచి కోట్ల రూపాయల్లో జీహెచ్‌ఎంసీ పన్నులు కట్టించేసుకుంటూ ఉండగా.. తన భూవివాదాన్ని కూడా ఈ ఊపులో చక్కబెట్టేయడానికి నాగార్జున ప్రయత్నిస్తూ ఉండవచ్చునని, అందుకు ఎంత మొత్తం పెనాల్టీ విధించినా.. పాత నోట్లలో చెల్లింపే గనుక.. కట్టేయడానికి సిద్ధంగా ఉన్నాననే ప్రయత్నాలు చేసి ఉండచ్చునని కొందరు అనుమానిస్తున్నారు.

Similar News