తొలిరోజు నేతలకు ఛాన్స్ ఇచ్చిన జగన్

Update: 2017-07-08 13:36 GMT

ఆంధ్ర ప్రదేశ్ రాజధానిలో తొలి సారి నిర్వహించిన వైకాపా మూడవ జాతీయ ప్లీనరీ తొలి రోజు సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది. ఉదయం 10గంటలకు ప్రారంభం కావాల్సిన ప్లీనరీ రెండున్నర గంటల ఆలస్యంగా మొదలైంది. ఉదయం 9.30కి కడప నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన జగన్ 10.30కి విజయవాడ విమానాశ్రయానికి వచ్చారు. అంతకు ముందు ఇడుపుల పాయ వైఎస్ సమాధి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు నిర్వహించిన జగన్ ముఖ్య నేతలు., కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ వచ్చారు. గన్నవరం విమానాశ్రయం వద్ద జగన్ కి భారీ స్వాగతం లభించింది. అక్కడి నుంచి ప్లీనరీ వేదిక వద్దకు చేరే సరికి 12 గంటల సమయం అయ్యింది. వేదిక మీద నివాళులు., సర్వ మత ప్రార్థనలు ముగిసి జగన్ స్వాగతోపన్యాసం అయ్యేసరికి 12.45 అయ్యింది.తొలి రోజు కేవలం 9నిమిషాలు మాత్రమే మాట్లాడిన జగన్ ఇతర నాయకులు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. వివిధ తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించే క్రమంలో ఒక్కో తీర్మానానికి ముగ్గురు., నలుగురి కి మాట్లాడే అవకాశం లభించింది. వాటితో పాటు జిల్లా తీర్మానాలు కూడా చేశారు. సాయంత్రం 5.55 నిమిషాలకు తొలి రోజు సమావేశాన్ని ముగించారు. మొత్తం మీద తొలి రోజు ఐదున్నర గంటల పాటు మాత్రమే వైకాపా జాతీయ ప్లీనరీ జరిగింది.

Similar News