తెలంగాణలో ఇంత అరాచకమా?

Update: 2017-02-12 16:17 GMT

తెలంగాణలో పట్వారీ వ్యవస్థ పోయింది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది అనుకుంటున్నారా? అయితే మీరు తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే గ్రామ అభివ‌ృద్ధి కమిటీల పేరిట అనేక గ్రామాల్లో నియంత పాలన కొనసాగుతుంది. ప్రశ్నిస్తే గ్రామ బహిష్కరణే. తమను కాదంటే ఊరి నుంచే తరిమేస్తారు. లేదంటే జరిమానా కట్టాల్సిందే. వారు చెప్పిందే వేదం. వారు చేసిందే న్యాయం. ఇది పెదరాయుడి తీర్పులా సాగుతున్న తంతు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో గ్రామ అభివృద్ధి కమిటీల పేరిట దోచుకు తింటున్నారు కొందరు. ప్రభుత్వం కూడా ఈ కమిటీలకే మద్దతిస్తుండటంతో ప్రజలు ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయారు.

కమీటీల ఏర్పాటు లక్ష్యం మంచిదే...

గ్రామాభివృద్ధి కమిటీల ఏర్పాటు లక్ష్యం మంచిదే. ఈ కమిటీల ద్వారా గ్రామంలో ఉన్న సమస్యలను నలుగురూ కూర్చుని పరిష్కరించుకునే వీలుంటుంది. రక్షిత మంచినీరు, రోడ్లు, సామాజిక భవనాలు వంటి కార్యక్రమాలు చేపట్టి కొన్ని ప్రాంతాల్లో ఈ కమిటీలు మంచిపేరే తెచ్చుకున్నాయి. తమ గ్రామాన్ని తామే బాగు చేసుకుంటామంటున్న ఈ కమిటీలకు దేశ స్థాయిలో కూడా ప్రశంసలు వచ్చాయి. అయితే కొన్ని చోట్ల మాత్రం ఈ కమిటీలు అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాయి. గ్రామాల్లో కనీస వసతుల కల్పనకు ఇవి కృషి చేయకుండా రాజకీయాలతో పాటుగా, కుల వివాదాలను ప్రోత్సహిస్తున్నాయన్న విమర్శ విన్పిస్తోంది. సర్పంచ్ పదవికి పోటీ చేయాలన్నా వీరి అనుమతి కావాల్సిందే. ఎంపీటీసీ గా నిలబడాలన్నా వీరి అంగీకారం కుదరాల్సిందే. అంగీకారం కోసం కమిటీకి కప్పం కట్టాల్సిందే. అడ్డగోలుగా వసూలు చేస్తున్నాయి ఈ కమిటీలు.

మాట వినకుంటే...వేటే...

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, బాల్గొండ నియోజకవర్గాల్లో ఈ కమిటీల అరాచకం ఎక్కువగా ఉందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా చిట్టాపూర్ లో వడ్డెర కులంలోని ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవను ఈ కమిటీలు క్యాష్ చేసుకున్నాయి. 60 కుటుంబాలను గ్రామం నుంచి కమిటీ బహిష్కరించడం కలకలం రేపింది. అలాగే సుబ్రియాల్ గ్రామంలో రామాలయ నిర్మాణం కోసం స్థలం ఇవ్వాలని దళితులను కమిటీ కోరింది. అయితే వారు నిరాకరించడంతో కుల బహిష్కరణ చేశారు. ఇందల్ వాయ్ మండలం గన్నారం గ్రామంలో రూప్లానాయక్ తండాలో గిరిజన కుటుంబాలను బహిష్కరించి వారిని వ్యవసాయ భూమిని సాగు చేసుకోనివ్వకుండా అడ్డుకున్నారు. ఇలాంటి ఉదంతాలు ఎన్నో కన్పిస్తున్నా ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. కమిటీల ముసుగులో ఆధిపత్యం చెలాయిస్తున్న వీరికి అడ్డుకట్ట వేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Similar News