తెలంగాణకు నచ్చని రీతిలో ‘కృష్ణా’ పంపకం

Update: 2016-12-10 09:30 GMT

మొత్తానికి కృష్ణా నదీ జలాలబోర్డు రెండు తెలుగు రాష్ట్రాల నీటి కేటాయింపులకు ఒక తుది ప్రతిపాదనను తయారు చేసింది. ఈ జలాలను పంచుకునే విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఎవరి వాదనలనుంచి వారు మెట్టు దిగకపోతుండడంతో.. బోర్డే ఆరు రకాల ప్రత్యామ్నాయాలను తయారుచేసి, వాటిలోంచి ఒకదానిని ఎంపిక చేసి రెండు రాష్ట్రాల ఇంజినీర్ ఇన్ చీఫ్ లకు పంపింది. వారు తమ ప్రభుత్వాలతో చర్చించి వెంటనే నిర్ణయం తెలియజేయాలని కోరింది. ఆ మేరకు నీటి కేటాయింపులు ఉంటాయని సూచించింది. బోర్డు ఫైనల్ గా తేల్చినదేంటంటే.. తెలంగాణకు 43, ఆంధ్రప్రదేశ్ 87 టీఎంసీలు వచ్చేలా ప్రతిపాదించారు.

అయితే ఇలాంటి ప్రతిపాదనను తెలంగాణ సర్కారు ఒక పట్టాన ఒప్పుకుంటుందా లేదా అన్నది అనుమానమే. బోర్డుకు తమ తరఫునుంచి తెలంగాణ సర్కారు సూచించిన దానికి, ప్రస్తుతం వచ్చిన కేటాయింపులకు చాలా వ్యత్యాసం ఉంది. కొన్ని రోజుల కిందటే బోర్డుకు లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం.. తమకు 56, ఏపీకి 74 టీఎంసీలు ఇవ్వాలని సూచించింది. పట్టిసీమ ప్రాజెక్టును కూడా పరిగణనలోకి తీసుకుంటే గనుక.. తమకు 74 ఏపీకి 56 టీఎంసీలు ఇవ్వాలని ప్రతిపాదించింది. అయితే బోర్డు మాత్రం తెలంగాణ 43, ఏపీకి 87 టీఎంసీలు అన్నట్లుగా తుది ప్రతిపాదనను తయారుచేయడం గమనార్హం.

అయితే ఎక్కడో ఒక చోట ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడాల్సిన అవసరం ఉంది. కేవలం కృష్ణా జలాల పంపకాలు తేలకపోవడం వల్ల తెలంగాణ లో కొన్ని ప్రాజెక్టుల పనులు కూడా స్తంభించిపోయే పరిస్థితి ఉంది. ఇరు రాష్ట్రాల వారు ఒకరిని ఒకరు నిందించుకుంటూ.. దాని పర్యవసానంగా ప్రజల్లో కూడా ఒకరి పట్ల మరొకరిలో శత్రుభావం ఏర్పడే వాతావరణం నెలకొంటోంది. అందువల్ల అంతిమంగా బోర్డు ప్రతిపాదించిన రీతిలోనో మరో రకంగానో తక్షణం పంపకాలను తేల్చుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

 

Similar News