తెగించేసిన గులాబీ దళాలు : ఎటాక్ కోదండం!

Update: 2016-11-08 11:08 GMT

తెలంగాణ ఉద్యమానికి సంబంధించి, రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. బంగారు తెలంగాణ సాధన దిశగా ప్రజల తరఫున ఉండి పోరాటం సాగించడం, ప్రభుత్వం దారితప్పి వ్యవహరిస్తూ ఉన్నా సరే.. ప్రభుత్వానికి ప్రజల పక్షాన సరైన మార్గ నిర్దేశనం చేయడం అనే బాధ్యతల్లో ప్రొఫెసర్ కోదండరాం కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. రాష్ట్రం సాధన కోసం ఉద్యమం జరుగుతున్న సమయంలో.. కేసీఆర్ తో సమానంగా కీలకంగా వ్యవహరించిన కోదండరాం, రాష్ట్రం స్వప్నం సాకారం అయిన తర్వాత.. తన ప్రొఫెసర్ ఉద్యోగం లోకి వెళ్లిపోయారు. రాజకీయ పదవులల మీద మమకారం పెట్టుకోకుండా దూరం ఉన్నారు. రిటైరైన తర్వాత కూడా ప్రజల పక్షాన ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారే తప్ప.. రాజకీయ వాసనలతో వ్యవహరించడం లేదు. అయితే.. తెరాస సర్కారుకు కొరుకుడు పడకుండా, అవసరమైన సందర్భాల్లో నిశిత విమర్శలు చేస్తూ ఉన్న మాట వాస్తవం.

కోదండరాం విమర్శలను, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్న మాటలను గులాబీ పార్టీ చాలాకాలం వరకు అంటీముట్టనట్లు వ్యవహరిస్తూనే వచ్చింది. కోదండరాం కు కూడా ప్రజల్లో ఆదరణ ఉన్నందున.. ఆయన మీద తిట్ల దండకం లంకించుకోకుండా చాలాకాలం ఉపేక్షించారు. అయితే తాజాగా.. కోదండరామ్ మీద కూడా ఎటాక్ మోడ్ లోకి వెళ్లిపోవాలని గులాబీ దళాలు డిసైడయినట్లుగా కనిపిస్తోంది. తాజాగా తెరాస ఎంపీ బాల్కసుమన్, కోదండరామ్ ను విమర్శించిన తీరు గమనిస్తే ఇలాంటి అనుమానాలే కలుగుతున్నాయి.

కోదండరామ్ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామాలో శిఖండి పాత్ర పోషిస్తున్నారంటూ బాల్క సుమన్ విమర్శిస్తున్నారు. నిజానికి ప్రొఫెసర్ సాబ్ విషయంలో ఇది చాలా తీవ్రమైన విమర్శ. నర్సంపేట , తుంగతుర్తి సీట్లను కోదండరాం ఇప్పించుకున్నారు అనేది బాల్క సుమన్ చేస్తున్న ఆరోపణ. రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి తెరాస రాజకీయాలకు కోదండరాం ను ఉద్దేశపూర్వకంగా దూరం పెట్టిన కేసీఆర్.. ఆయన మీద కాంగ్రెస్ ముద్ర వేయడానికి తొలినుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ కోదండరాం మాత్రం.. రాజకీయ పార్టీల ముద్రలేని వ్యక్తిగానే తన ప్రజా ఉద్యమాలు సాగిస్తున్నారు. అలాంటి నేపథ్యంలో బాల్కసుమన్ ఇంత తీవ్రమైన స్థాయిలో విమర్శలు చేయడం ప్రజల్లో సంచలనమే. ఒక రకంగా.. ఒక వర్గం ప్రజల్లో బాల్క సుమన్ మాటల వల్ల తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మీద గౌరవం తగ్గిపోయినా ఆశ్చర్యం లేదని, ఈ ఎంపీ దుడుకుతనం సెల్ఫ్ గోల్ అయినా ఆశ్చర్యం లేదని పలువురు విశ్లేషిస్తున్నారు.

Similar News