తమిళ రాజకీయాల్లో కమల్ ఎటువైపు?

Update: 2017-02-08 14:30 GMT

తమిళనాడు రాజకీయాలు సినీనటులను కూడా కదిలిస్తున్నాయి. జయ మరణం తర్వాత గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న సినీనటులు ఒక్కొక్కరూ స్పందిస్తున్నారు. తాజాగా ప్రముఖ నటుడు కమల్ హాసన్ తమిళ రాజకీయాలపై ట్వీట్ చేశారు. తమిళనాట నెలకొన్న రాజకీయ సంక్షోభంపై సినీనటులు ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలని ఆయన పిలుపు నిచ్చారు. దుష్ట రాజకీయాలను ఎప్పటికీ ప్రోత్సహించకూడదన్న కమల్ తాజా పరిణామాలపై నటులు తమ అసమ్మతిని తెలపాలనుకుంటే ఘాటుగానే స్పందించవచ్చని చెప్పారు. అయితే కమల్ చేసిన వ్యాఖ్యలను చూస్తే చిన్నమ్మకు వ్యతిరేకంగానే ఉన్నాయని చెబుతున్నారు. దుష్ట రాజకీయాలను తరిమికొట్టి పిలుపునివ్వడం అది చిన్నమ్మను ఉద్దేశించే కమల్ చేశారని పన్నీర్ వర్గం సంబరపడుతోంది.

పన్నీర్ కు మద్దతుగా గౌతమి...

ఇదిలా ఉండగా ఇటీవలే కమల్ హాసన్ నుంచి విడిపోయిన ప్రముఖ నటి గౌతమి కూడా తమిళ రాజకీయాలపై స్పందించారు. గౌతమి పూర్తిగా పన్నీర్ సెల్వానికి మద్దతు ప్రకటించారు. పన్నీరు సెల్వాన్ని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి ఉండాల్సింది కాదని అభిప్రాయపడ్డారు గౌతమి. జయ మరణంపై అనేక అనుమానాలున్నాయని, దీనిపై విచారణ జరిపించాలని కూడా గౌతమి గతంలో ప్రధాని మోడీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. మొత్తం మీద తమిళనాడులో జరుగుతున్న పాలిట్రిక్స్ పై సినీనటులు స్పందిస్తున్నారు. ఇటీవల జరిగిన జల్లికట్టు పై నిషేధానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనకు పెద్దయెత్తున తమిళ సినీ పరిశ్రమ తన మద్దతు తెలిపింది. మరి తమిళ సినీపరిశ్రమ ఎటువైపు నిలుస్తుందో? పన్నీర్ వైపా? శశికళ కు అనుకూలంగానా?

Similar News