ట్వీట్లతో చితక్కొడుతున్న రాహుల్

Update: 2017-11-06 05:30 GMT

ఆకట్టుకునే ప్రసంగాలు చేసే ప్రధాని మోడీకి తనదైన శైలిలో సవాళ్ళు విసురుతూ ఔరా అనిపిస్తున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. బహిరంగ సభలు, మీడియా మీట్స్ లోనే కాదు సామాజిక మాధ్యమాల్లోను రాహుల్ తనదైన శైలిలోనే విరుచుకుపడుతున్నారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల సభలో ప్రధాని మోడీ విపక్షాలపై ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. బస్ ఆలస్యంగా వస్తే మోడీ కారణం అంటున్నారు, ఇంట్లో వంట చేసుకోకపోతే మోడీ కారణం అంటున్నారు, వర్షం వచ్చినా రాకపోయినా మోడీ అనే రీతిలో విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని దుమ్మెత్తిపోశారు ప్రధాని. దేశంలో 57 వేలకోట్లరూపాయల సొమ్మును అవినీతిపరుల జేబులోకి వెళ్లకుండా చేశాననే ఈ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

మాటలు తూటాల్లా పేలుస్తున్న రాహుల్ ...

ప్రధాని కాంగ్రెస్ పై చేస్తున్న ఆరోపణలను ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ ట్విట్టర్ లో తక్షణం స్పందించారు. దేశంలో ముందు ధరలు తగ్గించి ప్రధాని మాట్లాడాలని ఎదురుదాడి చేశారు. దమ్ముంటే ధరలు తగ్గించండి లేదా కుర్చీ ఖాళీ చేసి పోవాలని రాహుల్ చేసిన ట్వీట్ సంచలనమే అయ్యింది. అలాగే ధరలు తగ్గించడం మాని ఉపన్యాసాలు చేయడం వల్ల ఎవరికి ప్రయోజనం లేదని రాహుల్ ఎద్దేవా చేశారు. ఇటీవల గత కొంత కాలంగా కాంగ్రెస్ యువ సారధి రాహుల్ క్షణాల్లో ట్విట్టర్ లో కి వచ్చి ఎప్పటికప్పుడు మోడీ పై కౌంటర్లు విసురుతూ హల్చల్ చేస్తున్నారు. పదునైన మాటలతో మోడీని సోషల్ మీడియా లో గుక్కతిప్పుకోనీయడం లేదు. రాహుల్ న్యూ ట్రెండ్ ఇప్పుడు కాంగ్రెస్ క్యాడర్ లో మంచి జోష్ నింపుతుంది.

Similar News