టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్.. జనం ఎంపిక మోదీ నే!

Update: 2016-12-05 15:32 GMT

2016 సంవత్సరానికి అత్యంత ప్రభావపూరితమైన వ్యక్తిగా టైమ్స్ మ్యాగజైన్ నిర్వహించిన ఆన్‌లైన్ పోల్ లో భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచ పాఠకుల ఓట్లను గరిష్టంగా గెలుచుకున్నారు. టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యే ప్రాసెస్ లో భాగంగా.. డిసెంబరు 4న ముగిసిన రీడర్స్ పోల్ లో మోదీకి అగ్రస్థానం లభించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ నేతలు, సెలబ్రిటీలు, నటులు, కళాకారులు అందరినీ తోసిరాజని మోదీ అత్యధిక ఓట్లు సాధించడం గమనార్హం. డిసెంబరు 7న అంతి ఫలితాలను వెల్లడించే ఈ పర్సన్ ఆఫ్ ది ఇయర్ ఎంపికలో రీడర్స్ పోల్ వరకు మోదీకి 18 శాతం ఓట్లు లభించాయి.

మోదీకి లభించిన ఓట్ల శాతంతో పోల్చినప్పుడు మిగిలిన పోటీదారులు సమీపంలో కూడా లేకపోవడం విశేషం. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రెసిడెంట్ ఎలక్ట్ డొనాల్డ్ ట్రంప్, వికీలీక్స్ స్థాపకుడు అసాంజే అందరికీ 7 శాతం వంతున ఓట్లు లభించాయి. ఫేస్ బుక్ జుకర్ బర్గ్ 2 శాతం, హిల్లరీ క్లింటన్ 4 శాతం ఓట్లతో వెనుకబడి ఉన్నారు.

ఈ ఓట్ల ఫలితాలు చెప్పే వాస్తవాల ప్రకారం.. ఓటింగ్ మిగిలిన ప్రపంచంలోను, యూఎస్ లోనూ వేర్వేరుగా ఉంటున్నదని తెలుస్తున్నదని నిర్వాహకులు ప్రకటించారు. మోదీకి ప్రధానంగా భారతీయ ఓటర్లలోనూ, యూఎస్ లోని కాలిఫోర్నియా, న్యూజెర్సీ ప్రాంతాల్లోనూ ఎక్కువ ఓట్లు లభించాయి.

టైమ్స్ పత్రిక ప్రతి ఏటా ఇలా అత్యంత ప్రభావ పూరితమైన వ్యక్తిని ఎంపిక చేస్తుంటుంది. గత ఏడాది ఇది జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ కు లభించింది.

Similar News