టీడీపీతో బీజేపీ గేమ్ స్టార్ట్ చేసిందా?

Update: 2017-11-10 05:30 GMT

ప్రాజెక్ట్ కట్టాలిసింది కేంద్ర ప్రభుత్వం. డబ్బు ఇచ్చేది కేంద్రం. కాంట్రాక్టర్ బాధ్యత తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఈ ప్రాజెక్ట్ క్రెడిట్ మొత్తం కాంట్రాక్టర్ తీసుకుంటే యజమాని ఎలా ఫీల్ అవుతారో ఇప్పుడు కేంద్రంలోని కమలం సర్కార్ అలానే ఫీల్ అయ్యింది. అంతే కీలక దశకు పోలవరం చేరుకున్నాక ఏపీ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తుంది.

ఇక అంతా రాజకీయమే ...

రాబోయేది ఎన్నికల ఏడాదే . దానికి ముందు ప్రతీది రాజకీయంతోనే ముడిపడి ఉంటుంది. ఏ పని ఎవరు చేసినా మా వల్లే అని చెప్పుకోక తప్పదు. పోలవరం ప్రాజెక్ట్ లో అదే జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ కి వైఎస్ రాజశేఖర రెడ్డి అంకురార్పణ చేసి కుడి ఎడమ కాలువలు దాదాపు పూర్తి చేశారు. కేంద్రంలో తన పలుకుబడితో చాలా వరకు అనుమతులు తెచ్చారు. విభజన సమయంలో కాంగ్రెస్ ఎంపీల వత్తిడి, బిజెపి ఏపీ నేతల వత్తిడి ఫలితంగా యుపిఎ ప్రభుత్వం జాతీయ ప్రాజెక్ట్ గా పోలవరాన్ని ప్రకటించి ఖర్చు తానే భరిస్తానని చట్టం చేసింది. ఇంత వరకు బానే వుంది. చట్టం తెచ్చిన కాంగ్రెస్ గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోగా బిజెపి, టిడిపి లు కేంద్ర రాష్ట్రాల్లో అధికారం సాధించాయి. ఆ తరువాత ఈ ప్రాజెక్ట్ తామే నిర్మించుకుంటామన్న రాష్ట్ర అభ్యర్ధన మిత్రపక్షం కావడంతో బిజెపి అంగీకరించక తప్పలేదు. అలా ఒకే అయ్యిందో లేదో చంద్రబాబు పాత జ్ఞాపకాలు చెరిగిపోయేలా కుడి ఎడమ కాలువలకు పట్టిసీమ, పురుషోత్తమ పట్నం ఎత్తిపోతలుగా మార్చి ప్రచారం మొదలెట్టేశారు. నదుల అనుసంధానం అంటూ స్లోగన్స్ మొదలు పెట్టారు. గ్రావిటీ తో కాకుండా పంపుల ద్వారా నీరు వెళ్ళే ఈ సంగమం నదుల అనుసంధానం కానీ కాదని కేంద్ర జలసంఘం స్పష్టం చేసినా బాబు సొంత మీడియా ముందు ఆ వాస్తవాలు జనంలోకి పెద్దగా పోలేదు.

ఇచ్చేది తెచ్చేది మేమే అని చెబుతున్న కమలం ...

ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలక భూమిక కేంద్రానిది అయితే ప్రచారం మాత్రం టిడిపి చేసుకుపోవడాన్ని కమలనాధులు తీవ్రంగా పరిగణించారు. వచ్చేవి ఎన్నికలు ఇప్పటికే బిజెపి సర్కార్ ఏమి ఏపీకి చేయలేదన్న ప్రచారం టిడిపి శ్రేణులు చేయడాన్ని గుర్తించిన కేంద్రంలోని బిజెపి వర్గాలు టిడిపి దూకుడుకు పోలవరం నుంచి చెక్ పెట్టేందుకు సిద్ధం అయ్యాయి. టిడిపి పూర్తిగా తమ దయాదాక్షిణ్యాలపై ఆధారపడిందనే సంకేతాలు ఇచ్చేందుకు పోలవరం పై సరికొత్త వ్యూహాన్ని కేంద్రం మొదలు పెట్టేసింది. దాంతో ఇప్పుడు టిడిపి డిఫెన్స్ లో పడింది. పోలవరం పై ఏదో ఒక రచ్చ క్రియేట్ చేయడం కేంద్రం అది పరిష్కరించినట్లుగా చూపిస్తూ వీలైనంత క్రెడిట్ తమఖాతాలో జమేసుకోవడం కమలనాధులు ఆరంభించారు.

ఇప్పుడు కాకపోతే ఎప్పటికి కాదు ...

కాఫర్ డ్యామ్ విషయంలో మెలికలు పెట్టిన కేంద్రం ఆ తరువాత ఒకే చేసినట్లు ప్రకటించింది. మరోవైపు పెండింగ్ నిధుల కోసం ఏపీ సీఎం గట్టిగా మాట్లాడలేని ప్రశ్నలు వేయలేని పరిస్థితి లో వున్నారు. దాంతో చంద్రబాబు తన ఆగ్రహాన్ని ఆవేదనగా మార్చుకుని మాట్లాడాలిసి వస్తుంది. పోలవరం పై చాలా ఖర్చు చేశామని కేంద్రం నుంచి నాలుగు వేలకోట్ల రూపాయలు పైబడి చేసిన పనులకు బకాయి ఉందని తాజాగా వెల్లడించారు. ఇప్పుడు పూర్తి కాకపోతే ఎప్పటికి కాదని రాష్ట్రం ముందుగా నిధులు ఖర్చు పెడుతుందన్నారు.

సీన్లోకి పురంధరేశ్వరి ....

వీటికి కౌంటర్ గా మాజీ కేంద్రమంత్రి పురంధరేశ్వరి రంగంలోకి దిగారు. కేంద్రమంత్రి గడ్కరీ ని కలసి పోలవరం వేగవంతంగా పూర్తి చేయాలని అభ్యర్ధించారు. తప్పనిసరిగా కేంద్రం ఆ బాధ్యత తీసుకుంటుంది అని ఎలాంటి ఆందోళన చెందాలిసిన పని లేదన్నారు గడ్కరీ. ఇలా బిజెపి పోలవరం క్రెడిట్ ప్రజల్లో సాధించేందుకు కుస్తీ మొదలు పెట్టింది.

అసలు సమస్య అక్కడేనా ...?

పోలవరం ప్రాజెక్ట్ పై రాష్ట్ర ప్రభుత్వం పొంతనలేని లెక్కలు సమర్పించి నిధులకు డిమాండ్ చేయడం పైనే కేంద్రం అలెర్ట్ అయినట్లు మరో వాదన వినవస్తుంది. అందుకే బిల్లులు తొక్కిపెట్టి కేంద్ర బృందాలను పంపుతూ, గ్రౌండ్ రియాలిటీ పరిశీలిస్తూ నిధులు మంజూరు చేయాలనీ ప్రభుత్వం భావిస్తుందంటున్నారు. పట్టిసీమ, పురుషోత్తమపట్నం ప్రాజెక్ట్ లను పోలవరం లో కలపడానికి ఇప్పటికే కేంద్రం సుముఖంగా లేకపోవడంతో అసలు సమస్య అక్కడే మొదలు అయ్యింది. వైఎస్ హయాంలో అంచనాలు, జరిగిన పనులు, ఇంకా జరగాలిసిన పనులకు ఎంత అవసరం అన్న లెక్కలతో కేంద్రం ఆట ప్రారంభించడం టిడిపి సర్కార్ కి సంకటంగా మారిందని విశ్లేషకులు చెబుతున్న మాట. దాంతో రాబోయే రోజుల్లో పోలవరం ప్రాజెక్ట్ పై టిడిపి , బిజెపి నడుమ క్రెడిట్ వార్ తో బాటు నిధుల యుద్హం ఉండటం ఖాయమన్న సంకేతాలు స్పష్టం అవుతున్నాయి.

Similar News