టీడీపీ రూటు మార్చిందా....?

Update: 2017-11-06 10:30 GMT

తెలంగాణ లో టిఆర్ ఎస్ టిడిపి పొత్తు పొడుస్తున్నట్లే కనిపిస్తుంది. కాంగ్రెస్ లోకి జంప్ అయిన మాజీ టిటిడిపి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆరోపణలు నిజమేనా అనే అనుమానాలు కలిగేలా టిడిపి నేతల ప్రవర్తన చాటిచెబుతుంది. ఏపీ ఆర్ధికమంత్రి టిడిపి పాలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తిన తీరు ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తెలంగాణ వెళ్ళి మరీ టి సీఎం ను అంతగా ఏపీ ఆర్ధికమంత్రి పొగడాలిసిన పనేముంది అన్న చర్చ మొదలైంది. రాబోయే రోజుల్లో టిఆర్ ఎస్ తో రాజకీయ పునరేకీకరణ దిశగా టిడిపి అడుగులు పడుతున్నట్లు తేలిపోతుంది. ఇంతకీ అసలు యనమల ఏమన్నారు...?

కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి అంతా ఇంతా కాదు ....

ఏపీ ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు తెలంగాణ లోని యాదాద్రిని సందర్శించి దైవదర్శనం చేసుకున్నారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ యాదాద్రిని కేసీఆర్ అద్భుతంగా అభివృద్ధి చేశారన్నారు. అంతే కాదు వేలకోట్ల రూపాయల అభివృద్హి పనులతో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి కేసీఆర్ నడుం బిగించారని ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన్ను అభినందించారు. విభజనకు ముందు తరువాత ఉప్పు నిప్పులా వున్న టిఆర్ ఎస్ తో వ్యవహారం సాగించిన టిడిపి ఇప్పుడు రూటు మార్చింది. తమ పార్టీ నుంచి రేవంత్ పోతూ యనమలకు కేసీఆర్ కి వేలకోట్ల రూపాయల కాంట్రాక్ట్ ల బంధం ఉందని ఆరోపించారు. యనమల బంధువులకి ఈ కాంట్రాక్ట్ లు ఇచ్చి తెలంగాణ వారికి మట్టి కొట్టారని విమర్శించారు రేవంత్ . ఆ సమయంలో విదేశాల్లో వున్న యనమల వచ్చాకా చాలా రోజుల తరువాత కానీ స్పందించలేదు. అదీ మీడియా గుచ్చి గుచ్చి అడిగిన సందర్భంలో తనకు కాంట్రాక్ట్ లు చేసే అలవాటు లేదని, ఇది అందరికి తెలిసిందే అని లాభాలు వస్తే రేవంత్ ను తీసుకోమంటూ సూటిగా చెప్పకుండా వ్యంగ్యంగా వ్యాఖ్యానించి ఇష్యూ క్లోజ్ చేశారు. ఇప్పుడు తాజాగా యనమల కేసీఆర్ సూపర్ అంటూ వ్యాఖ్యలు చేసి సెల్ఫ్ గోల్ వేసుకుని మరో కొత్త చర్చకు తెరలేపారు.

Similar News