టీడీపీ పంథాలోనే టీఆర్ఎస్

Update: 2017-02-09 04:33 GMT

తెలుగుదేశం పార్టీ రూట్లోనే గులాబీ పార్టీ కూడా వెళుతోంది. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీని ఆదర్శంగా తీసుకున్నట్లు కన్పిస్తోంది. 2015లో చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదులో కార్యకర్తల సంక్షేమం కోసం కూడా టీఆర్ఎస్ ప్లాన్ చేసింది. తెలుగుదేశం పార్టీ తరహాలోనే సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు బీమా సదుపాయాన్ని కల్పించారు గులాబీ పార్టీ నేతలు.

గతంలో 50 లక్షల మంది....

టీఆర్ఎస్ పార్టీ ప్రతి రెండేళ్లకొకసారి సభ్యత్వ కార్యక్రమాన్ని చేపడుతుంది. 2015లో చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఊహించని స్పందన లభించింది. అందుకే సభ్యత్వ నమోదులో కార్యకర్తల సంక్షేమాన్ని కూడా జోడించింది. సభ్యత్వం తీసుకున్న కార్యకర్తకు ఇన్సూరెన్స్ కూడా వర్తించేలా చర్యలు తీసుకున్నారు.దీనివల్ల పార్టీ సభ్యత్వాల సంఖ్య పెరగడమే కాకుండా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం అవుతుందని భావించారు. అందుకే సభ్యత్వ నమోదు కార్యక్రమం సూపర్ సక్సెస్ అయిందని చెబుతున్నారు. 2015లో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టీ అధినేత కేసీఆర్ నేతలకు టార్గెట్ లు కూడా పెట్టారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 25వేలు సాధారణ సభ్యత్వాలు, 5 వేలు క్రియాశీలక సభ్యులు కొత్తవారు చేరేలా ఉండాలని పార్టీ నేతలకు కేసీఆర్ ఆదేశించారు. అయితే అప్పడు ఊహించని రీతిలో 50 లక్షలకు మించి సభ్యత్వాలు వచ్చాయి. ప్రమాదాల్లో మరణించిన కార్యకర్తల కుటుంబాలకు బీమా సొమ్మును కూడా చెల్లించారు.

రూ.30 కోట్ల బీమా చెల్లింపు....

సభ్యత్వ నమోదు కార్యక్రమం వల్ల రెండు ఉపయోగాలున్నాయి. పార్టీ కార్యకర్తల సంఖ్యను గణనీయంగా పెంచుకోవడం ఒకటయితే.... ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లవచ్చు. దీంతో కేసీఆర్ ఈసారి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈసారి కేవలం పది రూపాయలు సభ్యత్వ రుసుం చెల్లిస్తే చాలు రెండు లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని కల్పించనున్నారు. ఇప్పటి వరకూ వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన 1500 మంది పార్టీ కార్యకర్తల కుటుంబాలకు సుమారు 30 కోట్ల రూపాయల బీమా సొమ్మును చెల్లించారు. మొత్తం మీద జోష్ మీదున్న అధికార పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో దూసుకెళ్లాలని భావిస్తోంది.

Similar News