టిడిపి టిక్కెట్ కావాలంటే....

Update: 2016-12-20 20:30 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు నేతలకు స్పష్టమైన సంకేతాన్నిచ్చారు. వచ్చే ఎన్నికల్లో పనితీరు ఆధారంగానే టిక్కెట్లు కేటాయిస్తామని చెప్పారు. పార్టీ మారి కొందరు....నియోజకవర్గం మారి కొందరు గెలుస్తున్నారని, ఈ సారి సర్వేల ఆధారంగా....నే ఎమ్మెల్యే టిక్కెట్టు ఉంటాయని చెప్పడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ నుంచి టీడీపీకి మారిన ఎమ్మెల్యేలు తమ పరిస్థితి ఏంటో అని భయపడిపోతున్నారు.

జంప్ జిలానీలకు షాక్...

వైసీపీ గుర్తు మీద గెలిచిన దాదాపు 16 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి టీడీపీలో చేరారు. పార్టీలో చేరినా...వారికి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సహకరించడం లేదు. ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన నేత తన పవర్ ను నేటికీ చాటుకుంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధి మొత్తం తన చేతులమీదుగానే జరగాలని భావిస్తున్నారు. అధికారులుకూడా తెలుగుదేశం నేతలకే ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన ఎమ్మెల్యేల పరిస్థితి మింగలేక...కక్కలేక...అన్నట్లు ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలను టీడీపీ వర్గం గ్రామాలకు కూడా రానివ్వడం లేదు. అలాంటి పరిస్థితుల్లో టిక్కెట్ల కేటాయింపు పనితీరు ఆధారంగానే అని చంద్రబాబు ప్రకటించడంతో వారు అయోమయంలో పడిపోయారు.

ఒడిషా...మంత్రం..

ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను బాబు ఆదర్శంగా తీసుకున్నారు. ఆయన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మందికి కొత్తవారికే టిక్కెట్లు కేటాయిస్తారు. ఎమ్మెల్యే పనితీరును నవీన్ పట్నాయక్ ఎప్పటికప్పడు సర్వే చేయిస్తూ బేరీజు వేసుకుంటారు. టీడీపీ వర్క్ షాప్ లో చంద్రబాబు నవీన్ పట్నాయక్ అంశాన్ని కూడా ప్రస్తావించారు. అందుకే నవీన్ అన్ని సార్లు గెలిచారని కూడా బాబు చెప్పడంతో తెలుగు తమ్ముళ్లు కంగుతింటున్నారు. ఈసారి తమకు టిక్కెట్ వస్తుందో....రాదో అన్న కలవరం బయలుదేరింది.

Similar News