టిఆర్ఎస్ డీలిమిటేషన్ గేమ్ ...?

Update: 2017-11-10 10:30 GMT

గులాబీ బాస్ ఇప్పుడు కొత్త వ్యూహం అమల్లో పెట్టారు. నిన్న మొన్నటి వరకు నియోజకవర్గాల పునర్విభజన మర్చిపొమ్మని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు కేంద్రం చేసి తీరుతుందని సరికొత్త స్లోగన్ అందుకున్నారు. ఖచ్చితంగా కేంద్రప్రభుత్వం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభ్యర్ధన మన్నించి ఆదిశగా అడుగులు వేస్తుందని పదే పదే టిఆర్ ఎస్ మంత్రులతో సైతం చెప్పించే పనిలో బిజీ అయ్యారు.

ఎందుకలా కేసీఆర్ .?

తెలంగాణ లో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అవసరానికి మించి టిఆర్ ఎస్ కు బలమైన అభ్యర్థులే వున్నారు. ఇప్పుడు ఉన్నవారిలోనే టికెట్ కోసం సిగపట్ల పంచాయతీని గులాబీ పార్టీ తేల్చలేక కిందా మీదా పడుతుంది. కొత్తగా వలసలు ప్రోత్సహిస్తే నియోజకవర్గాల్లో సీట్లు ఆశించే వారు అసంతృప్తితో అలకలు మొదలు పెడతారు. వచ్చే వారంతా తమకు సీట్ గ్యారంటీ అని హామీ లభిస్తేనే కారు ఎక్కేందుకు రెడీ అంటున్నారు. అనుమానం వ్యక్తం చేస్తే హస్తం చెయ్యి అందుకునేందుకు సిద్ధం అయిపోవడాన్ని టిఆర్ఎస్ గ్రహించి ఈ పరిస్థితి కి బ్రేక్ కొట్టే పనిలో పడింది.

తొలి ప్రాధాన్యత టిఆర్ఎస్ కు ...

సీజన్ ప్రారంభం కావడంతో టిడిపి, ఇతర పార్టీలనుంచి వలస వచ్చే వారంతా తొలి ప్రాధాన్యత అధికారపార్టీకి, రెండో ప్రాధాన్యత కాంగ్రెస్ కి ఇస్తున్నారు. నియోజకవర్గాల పెంపు లేదని తెలిస్తే అధికశాతం కాంగ్రెస్ వైపే మొగ్గు చూపే వాతావరణం కనిపిస్తుంది. దాంతో డీలిమిటేషన్ మంత్రాన్ని కేసీఆర్ బయటకు తీసి విజయవంతం గా వాడేస్తున్నారు. గతంలో నియోజకవర్గాల పెంపు లేనేలేదని తేల్చిన కేంద్రం మరి కేసీఆర్ చంద్రబాబు లు జపిస్తున్న తాజా మంత్రానికి ఆమోదం వేస్తుందో లేదో చూడాలి.

Similar News