జైట్లీతో ఓకే అనని చంద్రబాబు : కేంద్రంపై అపనమ్మకమే?

Update: 2016-11-28 09:09 GMT

నోటు కష్టాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఏర్పడుతున్న సంక్షోభాన్ని క్రమంగా కేంద్రం గుర్తిస్తోంది. ప్రజలందరూ గొప్పగా సహకరిస్తున్నారు. ఎవ్వరూ ఎలాంటి వ్యతిరేకత చూపించడం లేదు అంటూ కొన్ని రోజులు నెట్టుకొచ్చిన మోడీ సర్కార్.. ఇక మాటలతో లాభం లేదని గ్రహించినట్లుంది. క్రియాశీలంగా ఏదోటి చేయడానికి ఉద్యుక్తం అవుతోంది. అయితే.. ఆ బాధ్యతను మరొకరికి మీదకు నెట్టేసి.. వినోదం చూడడం ఉద్దేశం అన్నట్లుగా.. దేశంలోని అయిదుగురు ముఖ్యమంత్రులతో ఓ కమిటీని వేసి, దాని ద్వారా ఏం చేస్తే బాగుంటుందో నిర్ణయించాలని కేంద్రం సోమవారం నిర్ణయాన్ని వెలువరించింది.

అయిదుగురు ముఖ్యమంత్రులతో ఏర్పాటు చేస్తున్న కమిటీకి సారథ్యం వహించాల్సిందిగా.. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేసి కోరినప్పుడు, అందుకు చంద్రబాబు ఓకే చెప్పలేదని వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రుల కమిటీకి నేతృత్వం వహించే అవకాశం గొప్పదే కావొచ్చు గాక.. కానీ.. జనం కష్టాలను దూరం చేయడానికి అవసరమైన బాధ్యత తీసుకోవాలి. అది చేతకానప్పుడు ఊరకుండడం ఉత్తమం. కానీ జనం కష్టాలను దూరం చేసే విషయంలో కేంద్రం నిర్దిష్టంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కనీసం జనం కష్టాలు పడుతున్నారని ఒప్పుకోవడం కూడా లేదు.

అలాంటి నేపథ్యంలో ఈ కేంద్రప్రభుత్వాన్ని నమ్మి బాధ్యత తీసుకుంటే అభాసు పాలు కావాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే.. అరుణ్ జైట్లీ అడిగిన వెంటనే ఓకే చెప్పకుండా చంద్రబాబు దాటవేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు తన నిర్ణయాన్ని చెప్పలేనని, ప్రతిపాదనను పరిశీలిస్తానని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది.

అదే సమయంలో.. బ్యాంకులు వ్యవహరిస్తున్న తీరు, ఆర్బీఐ పరంగా వైఫల్యాలపై చంద్రబాబునాయుడు అరుణ్ జైట్లీ తో తన అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. 20 రోజులు గడుస్తున్నా పరిస్థితిన ఏమాత్రం చక్కదిద్దలేకపోవడంపై ఆయన ఆగ్రహంగానే స్పందించినట్లు చెబుతున్నారు. బ్యాంకర్ల వైఫల్యానికి ప్రభుత్వాలు నిందలు భరించాల్సి వస్తున్నందంటూ చంద్రబాబునాయుడు జైట్లీ దృష్టికి తీసుకెళ్లారు.

అయితే కేంద్రం విజ్ఞప్తిని పరిగణించి చంద్రబాబు నేతృత్వం వహిస్తారా.. దేశాన్ని డిజిటల్ ఆర్థిక ప్రపంచం దిశగా నడిపించడం కీలక భూమిక పోషిస్తారా లేదా వేచిచూడాలి.

Similar News