జేజమ్మ గెలిచింది : 3 కొత్త జిల్లాలకు కేసీఆర్‌ ఓకే!

Update: 2016-10-03 12:31 GMT

ప్రజలనుంచి వస్తున్న డిమాండ్లను అనుసరించి కొత్తగా మరో మూడు జిల్లాలను కూడా ఏర్పాటు చేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంగీకరించారు. కొత్తగా గద్వాల, సిరిసిల్ల, జనగామ జిల్లాలను ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి అంగీకరించారు.

కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రజాభిప్రాయానికి కూడా పెద్దపీట వేయాల్సిందేనని తొలినుంచి చెబుతూ వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ విషయాన్ని ఆచరణలో కూడా నిరూపించారు. రెండు రోజులుగా వివిధ జిల్లాలకు చెందిన నేతలతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. జిల్లాల ఏర్పాటు గురించి ప్రభుత్వం ప్రకటించిన ముసాయిదా మీద వేర్వేరు రకాల అభ్యంతరాలు ఉన్న ప్రాంతాలకు చెందిన అందరు నాయకులతో కేసీఆర్‌ ప్రత్యేకంగా సమావేశం కావడం విశేషం.

ఆ మేరకు శంషాబాద్‌ జిల్లా పేరును రంగారెడ్డి జిల్లాగా మార్చడానికి కేసీఆర్‌ నిన్ననే అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. సోమవారం నాడు మళ్లీ వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాలకు చెందిన నేతలతోనూ కేసీఆర్‌ సమావేశం అయ్యారు. వారి వారి అభిప్రాయాలను విన్నారు. కరీంనగర్‌ లో కొత్తగా సిరిసిల్ల జిల్లా ఏర్పాటుకు వారికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అలాగే వరంగల్‌ నేతలతో సమావేశం సందర్భంగా జనగామ జిల్లా ఏర్పాటుకు కూడా అంగీకరించారు. ప్రత్యేకించి డికె అరుణ సారథ్యంలో మడమ తిప్పని పోరాటం సాగిన గద్వాల జిల్లా గురించి కూడా కేసీఆర్‌ సానుకూలంగానే స్పందించడం విశేషం.

గద్వాల జిల్లా ఏర్పాటుకు ముఖ్యమంత్రి అంగీకరించడం పట్ల అక్కడి ఎమ్మెల్యే డికె అరుణ ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదొక విలక్షణమైన పరిణామంగా చెప్పాలి. ఒక రకంగా గద్వాల జిల్లాను చేయడం కోసం కేసీఆర్‌ తో పోరాడి, తన రాజీనామాకు సైతం సిద్ధపడిన జేజమ్మ డికె అరుణ విజయం సాధించినట్లుగా జనం అనుకుంటున్నారు.

Similar News