జానా... వేదన..అంతా.. ఇంతా..కాదు..!

Update: 2017-11-07 06:30 GMT

సీనియర్ నేత, కాంగ్రెస్ శాసనసభపక్ష నేత జానారెడ్డి తీవ్రంగా మధనపడుతున్నారు. గత వారం రోజుల నుంచి అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలు, సొంత పార్టీలో చోటు చేసుకుంటున్న ఘటనలు ఆయన మనసును గాయపర్చినట్లున్నాయి. ఆయన సన్నిహితుల వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మీడియా ప్రతినిధులతో కూడా ఆయన మనసు విప్పి మాట్లాడుతున్నారు. దిగజారిన రాజకీయ వ్యవస్థలో రాజీ పడాలా? వద్దా? అని తన మనసు ఘర్షణ పడుతుందని జానా ఆవేదన చెందుతున్నారు. గత కొద్దిరోజులుగా అసెంబ్లీలో జరుగతున్న తీరును పరిశీలిస్తున్న జానా గతంలో ఎన్నడూ ఇలా సభలు జరగలేదని స్పష్టం చేశారు.

ఫెయిల్యూర్ అసెంబ్లీలోనే మేమున్నాం....

అసెంబ్లీలో తాము ఫెయిల్ కాలేదని, ఫెయిల్యూర్ అసెంబ్లీలోనే తాము ఉన్నామని జానా రెడ్డి అభిప్రాయపడుతున్నారు. మంచి సలహాలు ఇస్తే స్వీకరిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఆ ప్రయత్నమే చేయడం లేదని వాపోతున్నారు. యాభై శాతం బినామీ ఆస్తులు అధికారుల వద్దే ఉన్నాయని, 30 శాతం వ్యాపారులు, ధనిక వర్గాల వద్ద ఉన్నాయన్నారు. 20 శాతం మాత్రమే రాజకీయ నేతల వద్ద ఉన్నాయని జానారెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు అంతో ఇంతో అవినీతికి పాల్పడుతున్నారని జానారెడ్డి అంగీకరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలది ఒక్కొక్కరిదీ ఒక్కొక్క మనస్తత్వమని, ఎవరి పంథా వారిదేనన్నారు. సినిమాల్లో ఒకే ఒక బాహుబలి ఉంటారని, రాజీకీయాల్లో చాలా మంది బాహుబలులు ఉంటారని చెప్పారు. జానారెడ్డి ఆవేదనకు ప్రధాన కారణం శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడమేనని తెలుస్తోంది. మరోవైపు సొంత పార్టీలో జరగుతున్న పరిణామాలు కూడా జానారెడ్డి ఆవేదనకు కారణంగా తెలుస్తోంది.

Similar News