జల్లికట్టు..వదలడం లేదే....?

Update: 2017-01-27 17:11 GMT

తమిళనాడు జల్లికట్టు ఉద్యమం ఏ వేశావిశేషాన జరిగిందో తెలియదు కాని దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇప్పడు ఉద్యమాలన్నీ నడుస్తున్నాయి. జల్లికట్టు తరహా ఉద్యమం చేస్తే కేంద్రం దిగివస్తుందన్న భావన దేశమంతా...ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో బలంగా ఏర్పడినట్లుంది. అందుకే ఏపీలో ప్రత్యేక హోదా, కర్ణాటకలో కంబళ క్రీడ కోసం ఉద్యమాలు జరుగుతున్నాయి. తాజాగా ట్రిపుల్ తలాక్ కోసం జల్లికట్టు తరహా ఉద్యమం చేయాలని ముస్లిం యువకులకు పిలుపునిచ్చారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. ముస్లింలు ట్రిపుల్ తలాక్ కోసం పోరాడాలని ఆయన కోరారు.

ముస్లింలలో మూడుసార్లు తలాక్ అంటే భార్యకు విడాకులిచ్చినట్లే. అయితే దీనిపై కొందరు ముస్లిం మహిళలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ట్రిపుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళలు తీవ్రంగా నష్టపోతున్నామన్నది వారి వాదన. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టు విచారణలో ఉంది. అయితే ముస్లిం మత పెద్దలు మాత్రం ఇది తమ ఆచారమని చెబుతున్నారు. ముస్లిం సంప్రదాయాన్ని ప్రశ్నిండానికి మీరెవరు అంటున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ ను రద్దు చేస్తే మంచిదని భావిస్తుంది. పలు సందర్భాల్లో కమలనాధులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు కూడా. అయితే తాజాగా అసదుద్దీన్ ఒవైసీ ప్రకటనతో ట్రిపుల్ తలాక్ ను మరో జల్లికట్టు ఉద్యమంలా మార్చే అవకాశం ఉన్నట్లు కన్పిస్తోంది.

Similar News