జమ్మికుంటకు ఎంత కష్టమొచ్చింది?

Update: 2017-01-24 05:00 GMT

తెల్లబంగారం పండించిన రైతులకు కష్టాలు తప్పడం లేదు. సరైన ధరలేక పత్తి రైతులు చితికి పోతున్నారు. పైగా మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా జమ్మికుంట పత్తి మార్కెట్ మూతబడటంతో రైతులు దిగాలు పడ్డారు. పత్తి కొనుగోళ్లు లేక అవస్థలు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎనుమాముల మార్కెట్ తర్వాత పెద్దది జమ్మికుంట పత్తి మార్కెట్. అయితే హమాలీలు,కొనుగోళ్లదారుల మధ్య జరిగిన గొడవ కారణంగా ఈ మార్కెట్ ను మూసివేశారు. దాదాపు నాల్గు రోజులు మూతపడిన మార్కెట్ మళ్లీ తెరుచుకోవడంతో రైతులు పత్తి అమ్మకానికి సిద్ధమయ్యారు. అయితే మళ్లీ గొడవ జరగడంతో మార్కెట్ లో కొనుగోళ్లు నిలిచిపోయాయి.

మార్కెట్ మూతపడటంతో దళారులు రంగ ప్రవేశం చేశారు. క్వింటాల్ పత్తిని 4,300లకే దళారులు కొనుగోలు చేశారు. మార్కెట్ మూతపడటంతో తీసుకొచ్చిన పత్తిని ఇంటికి తీసుకెళ్లలేక...అక్కడ ఉంచే అవకాశం లేక అయినకాడికి రైతన్నలు అమ్ముకుని వెళ్లారు. ధర బాగా పెరిగిన సమయంలో హమాలీలు, కొనుగోళ్లదారుల మధ్య గొడవ జరిగింది. మార్కెట్ ఛైర్మన్ ఇరువర్గాలకూ చేసిన రాజీ ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు సంధిప్రయత్నం చేసి సోమవారం మార్కెట్ తెరుచుకున్నా...హమాలీలు, కొనుగోళ్ల దారుల మధ్య మామూళ్ల గొడవ మళ్లీ మొదలైంది. దీంతో మార్కెట్ ను నిరవధికంగా మూసేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పత్తిరైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. మార్కెట్ ఛైర్మన్ హమాలీల సంఘం అధ్యక్షుడిగా కూడా ఉండటంతో ఈ సమస్యకు తెరపడేట్టు లేదు.

Similar News