జగన్ సంచలన ప్రకటన ఏంటంటే...

Update: 2017-02-16 14:30 GMT

ప్రత్యేక హోదా కోసం తన ఎంపీలను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని వైసీపీ అధినేత జగన్ చెప్పారు. వచ్చే జూన్ లోనే ప్రత్యేక హోదా కోసం తమ పార్టీకి చెందిన ఎంపీలు రాజీనామా చేస్తారని చెప్పి సంచలన ప్రకటన చేశారు. ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లవుతుంది కాబట్టి జూన్ తర్వాత జరిగే పార్లమెంటు సమావేశాల్లోనే తన పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారన్నారు. గుంటూరులో జరిగిన యువభేరి కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. ప్రత్యేక హోదా వస్తే విడిపోయిన రాష్ట్రం ఎంతో బాగుపడుతుందని ఆశించమన్నారు. అయితే హోదా కాకుండా ప్యాకేజీతో సరిపెట్టిన కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు పలకడం చూస్తే వెగటు పుడుతుందని జగన్ అన్నారు. ప్రత్యేక హోదా సాధించేవరకూ తాను నిద్రపోనన్నారు. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను మభ్య పెడుతున్నారని జగన్ ఆరోపించారు. ఎవరికి పడితే వారికి సూట్లు, బూట్లు వేసి అవగాహన ఒప్పందాలు కుదుర్చకున్నామని జనాన్ని చంద్రబాబు మోసం చేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రిగా ఉండి తెలుగుజాతి కోసం పోరాడకుండా వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ఇందుకు జగన్ ఒక కధ చెప్పారు. రోమన్ చక్రవర్తి సీజర్ ను తన స్నేహితుడు బ్రూటస్ కత్తితో వెన్నుపోటు పొడిచినప్పుడు ‘యూ టూ బ్రూటస్’ అంటారని, ఇప్పడు మొత్తం తెలుగు జాతి ‘నువ్వు కూడానా చంద్రబాబూ ’ అంటారని జగన్ ఎద్దేవా చేశారు.

సీఎం పదవి ఎందుకంటే...

తనను ముఖ్యమంత్రి పదవి కోసం పాకులాడుతున్నారని విమర్శిస్తున్నారని, అయితే తాను సీఎం పదవిని ఆశిస్తున్నది కీర్తి కోసమేనని అన్నారు. ‘నేను మరణించిన తర్వాత నాన్న (వైఎస్ఆర్) ఫొటో లాగానే ప్రతి ఇంట్లో నా ఫొటో ఉండాలి’ అందుకోసమే తప్ప చంద్రబాబులాగా అవినీతి సొమ్ము కోసం సీఎం పదవిని ఆశించడం లేదన్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలతో సమానంగా పోటీ పడాలంటే ప్రత్యేక హోదా తప్పనిసరిగా కావాలని జగన్ అభిప్రాయపడ్డారు. రాదు...రాదూ అన్న తెలంగాణ రాష్ట్రాన్ని పక్క రాష్ట్రం వాళ్లు పట్టుబట్టి సాధించుకుంటే....ప్రత్యేక హదాను మనం సాధించుకోలేమా? అని ప్రశ్నించారు. జగన్ యువభేరికి మంచి స్పందన లభించింది.

Similar News