వైకాపా కి అధికారమొస్తే రాజధాని ఇదే..!

Update: 2017-11-10 11:30 GMT

జగన్ పాదయాత్ర కొంత తనపై ఉన్న అపోహలను తొలగించుకునేందుకు ఉపయోగపడుతుందనే చెప్పాలి. జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో తనపై అధికార పార్టీ చేస్తున్న ఆరోపణలకు, విమర్శలకు ధీటుగా సమాధానం ఇస్తూ వస్తున్నారు. అందుకే ప్రతి విమర్శకూ ఆయన ప్రజలకు వివరణ ఇస్తున్నారు. వైఎస్ జగన్ పై ప్రధాన ఆరోపణ వైసీపీని అధికారంలోకి తెస్తే రాజధానిని అమరావతి నుంచి మారుస్తారన్నది. ఇది ఎప్పటి నుంచో టీడీపీ, ఎల్లోమీడియాలు విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి. జగన్ ముఖ్యమంత్రి అయితే రాజధానిని రాయలసీమ ప్రాంతానికి తరలించుకు వెళ్లిపోతారని, అప్రమత్తంగా ఉండాలని జగన్ పై విపరీతమైన ప్రచారం ఇటు సోషల్ మీడియాలోనూ జరుగుతోంది. అయితే ఈ విమర్శలకు పాదయాత్రలోనే జగన్ చెక్ పెడుతున్నారు.

రాజధాని అమరావతిలోనే....

తాను అధికారంలోకి వచ్చినా రాజధానిని మార్చే ప్రసక్తి లేదని జగన్ చెబుతున్నారు. అద్భుతమైన రాజధానిని అమరావతి ప్రాంతంలోనే నిర్మిస్తామని, ఇప్పటి ప్రభుత్వం కంటే వేగంగా నిర్మిస్తామని జగన్ చెప్పుకొచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం గత మూడున్నరేళ్లుగా తాత్కాలిక భవనాల పేరిట కోట్లాది రూపాయలు కొల్లగొట్టిందని, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. దేశంలోనే అత్యున్నత రాజధానిని నిర్మిస్తామని చెప్పిన చంద్రబాబు మూడున్నరేళ్లవుతున్నా దాని డిజైన్లను కూడా ఖరారు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో గెలవడం కోసమే జగన్ కు ఓటేస్తే రాజధానిని తరలిస్తారన్న ప్రచారం టీడీపీ జోరుగా చేస్తుందని, వీటిని దయచేసి ప్రజలు నమ్మవద్దని జగన్ కోరడం విశేషం. అంతేకాదు రాజధాని అమరావతిలోనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Similar News