జగన్ యాత్ర... సమ్ థింగ్ స్పెషల్ గా...!

Update: 2017-11-07 11:30 GMT

వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అడుగుడగునా ప్రజలు జగన్ కు నీరాజనం పడుతున్నారు. జగన్ కూడా పాదయాత్ర చేస్తూ ప్రజాసమస్యలను వారిని అడిగి మరీ తెలుసుకుంటున్నారు. అంతేకాదు రాత్రి వేంపల్లి లో బస చేసిన జగన్ ఉదయం లేచిన వెంటనే స్థానిక కార్యకర్తలతో సమావేశమయ్యారు. ముఖ్య నేతలతో ముచ్చటించారు. స్థానిక రాజకీయాలను గురించి ఆరా తీశారు. కార్యకర్తల సమావేశం జరిగే సమయంలో ముఖ్య నేతలను ఎవరినీ రానివ్వకుండా వారి అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పాలన్నారు. జగన్ కు ఒక రకంగా కిందిస్థాయి కార్యకర్తల నుంచి పార్టీ గురించి, నేతల గురించి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఉదయం వేంపల్లె నుంచి బయలుదేరిన అనంతరం క్రాస్ రోడ్డు వద్ద జెండాను ఆవిష్కరించారు.

సమావేశాలు.. సమస్యలు వింటూ...

మరోవైపు కులసంఘాలతోనూ సమావేశమవుతున్నారు. వారి సమస్యలను అక్కడే అడుగుతున్నారు. మైనారిటీలు, మహిళలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించిన జగన్ వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ గ్రామంలో ఎన్ని పింఛన్లు మంజూరయ్యాయి? ఎంతమందికి ఇంకా రావాల్సి ఉంది అని కూడా అడుగుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో వచ్చి జగన్ వద్ద తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకం నిలిచిపోయిందని ఆవేదన చెందారు కొందరు. అలాగే ఉపాధ్యాయసంఘాలు కూడా ఈరోజు జగన్ ను కలిశాయి. పాత పద్ధతిలోనే పింఛన్లు వచ్చేలా చూడాలని ఉపాధ్యాయులు కోరారు. పెన్షన్ స్కీం పాత పద్ధితిలో లేకుంటే తాము ఇబ్బంది పడతామన్న ఉపాధ్యా సంఘాల ప్రతినిధులకు జగన్ భరోసా ఇచ్చారు. నాణ్యమైన విద్య అందించేందుకు మ్యానిఫేస్టోలో పొందుపరుస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా మహిళలు, యువత జగన్ ను చూసేందుకు బారులు తీరడం కన్పించింది. కొందరు మహిళలు హారతులతో జగన్ కు స్వాగతం చెబుతుండటం విశేషం. రైతులతో కూడా జగన్ ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. మొత్తం మీద పాదయాత్ర జగన్ కు చాలా ఉపయోగపడే అవకాశముందంటున్నారు. పార్టీ ఫీడ్ బ్యాక్ తో పాటు ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునే అవకాశం జగన్ కు చిక్కినట్లయింది. జగన్ కూడా వారి ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం ఇస్తున్నారు. అందరితో సెల్ఫీలు దిగుతున్నారు.

Similar News