జగన్ పాదయాత్రతో టీడీపీ క్యాడర్ లాభపడనుందా?

Update: 2017-11-08 10:30 GMT

జగన్ పాదయాత్ర నేపథ్యంలో చినబాబు కూడా అలెర్ట్ అయ్యారు. జగన్ పాదయాత్ర ప్రారంభం కావడంతో పార్టీ నేతలతో పాటు వైసీపీ క్యాడర్ లో కూడా ఉత్సాహం పెరిగింది. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతాల వరకూ జగన్ పాదయాత్రపైనే చర్చించుకుంటున్నారు. దీంతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ టీడీపీ క్యాడర్ పై దృష్టి పెట్టారు. తెలుగుదేశం పార్టీ పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిందంటే అది కార్యకర్తల కృషి అన్నది అందరికీ తెలిసిందే. అయితే గత మూడున్నరేళ్లుగా మంత్రులు, ఎమ్మెల్యేలు క్యాడర్ ను పట్టించుకోవడం లేదని చినబాబుకు ఫిర్యాదులు వేల సంఖ్యలో అందుతున్నాయి. అయితే వీటిని ఇప్పటి వరకూ పట్టించుకోలేదు. తన వద్దకు వచ్చిన ఫిర్యాదులను సదరు మంత్రి, ఎమ్మెల్యే వద్దకు పంపుతున్నారు. అయితే ఇప్పుడు జగన్ పాదయాత్రతో చినబాబు క్యాడర్ లో ఉత్సాహం నింపేందుకు రెడీ అయ్యారు.

అలెర్ట్ అయిన చినబాబు....

తన వద్దకు టీడీపీ కార్యకర్తలు పంపిన ఫిర్యాదులతో పాటు నియోజకవర్గాల్లో కార్యకర్తలు ఏమేర లాభపడ్డారన్నదానిపై చినబాబు దృష్టి సారించారట. ఈ మేరకు కార్యకర్తల అభిప్రాయాలను ప్రత్యేక బృందం చేత సేకరిస్తున్నారట. వారిచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు కార్యకర్తలకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలన్నది చినబాబు ఆలోచన. పార్టీ అధికారంలోకి వచ్చినా తాము లాభపడింది ఏమీ లేదన్నది వేలాది మంది కార్యకర్తల ఆవేదన. జెండా మోసిన వారిని అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కన పెట్టారని అనేక సమావేశాల్లో కార్యకర్తలు ఆవేదన చెందారు. అయితే ఎన్నికల సమయం ముంచుకొస్తుండటం, జగన్ పాదయాత్ర ప్రారంభం కావడంతో క్యాడర్ సంక్షేమానికి చినబాబు చర్యలు ప్రారంభించారట. అంతేకాదు తొలుత కార్యకర్తలకే అన్ని విషయాల్లో ప్రయారిటీ ఇవ్వాలని మంత్రి లోకేష్ నిర్ణయించారు. ఈ మేరకు అనధికారికంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆదేశాలు వెళ్లాయి. నియోజకవర్గంలో ఉన్న చిన్న చిన్న కాంట్రాక్టు పనులను అప్పగించాలని ఆదేశించారట. అలాగే వివిధ పథకాల లబ్దిదారుల్లో పసుపు జెండా మోసిన వారే ఎక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్యాడర్ లో అసంతృప్తి ఉంటే వచ్చే ఎన్నికల్లో కష్టమని భావించిన చినబాబు క్యాడర్ జారిపోకుండా.. అసంతృప్తికి లోనుకాకుండా చర్యలు ప్రారంభించారు. నియోజకవర్గాల వారీగా కార్యకర్తలకు ఏమేం అందాయో తనకు నివేదిక పంపాలని లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే లోకేష్ కార్యకర్తల సంక్షేమ నిధిని ప్రారంభించి కార్యకర్తలకు చేరువయ్యారు. మరోసారి క్యాడర్ ను పట్టించుకోవాలని ప్రతి జిల్లా అధ్యక్షులకూ లోకేష్ సమచారం పంపారట. మొత్తం మీద జగన్ పాదయాత్ర దెబ్బకు టీడీపీ క్యాడర్ లాభపడుతోందన్న మాట.

Similar News