జగన్ తొలి అడుగులో... తొలి మాటలివే...!

Update: 2017-11-06 06:30 GMT

వైసీపీ అధినేత జగన్ తొలి అడుగు పడింది. పాదయాత్ర ప్రారంభమైంది. తల్లి విజయమ్మ నుంచి ఆశీస్సులను తీసుకున్న జగన్ కుటుంబ సభ్యులకు జాగ్రత్తలు చెప్పి పాదయాత్రకు బయలుదేరారు. ఈ సందర్భంగా జగన్ తన మనసులో మాటను ప్రజలకు చెప్పారు. ఇకపై తాను మాట్లాడే ప్రతి మాటా...సామాజిక మాధ్యమంలో ఉంటుందని తెలిపారు. ఫేస్ బుక్ లో జగన్ తొలి వీడియోను విడుదల చేశారు. జగన్ మాటల్లోనే ‘ తెలుగు ప్రజలకు నమస్కారం. గతంలో ప్రకటించిన విధంగా ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించాను. వైఎస్సాఆర్ కుటుంబం ద్వారా నా కుటుంబంలో మీరు ఒక్కటయ్యారు. భాగంగా మారారు. మీరు నమ్మి నాతో ప్రయాణం చేస్తున్నందుకు మనస్ఫూర్థిగా ధన్యవాదాలు. ఏడు నెలల పాటు నేను మూడు వేల కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేయనున్నాను. ఈ పాదయాత్ర ద్వారా మీ అందరికీ దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తాను. మీరు చెప్పే ప్రతి మాట వినీ.. మీ కష్టాన్ని, నష్టాన్ని తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తాను. నవరత్నాలను గతంలోనే మీముందుంచాను. నవరత్నాలను మెరుగుపర్చడానికి మీరిచ్చేసలహాలు తీసుకుని వాటిని మార్చేందుకు కూడా నేను సిద్ధమే. ఎన్నికలకు ముందు విడుదలచేసే మ్యానిఫేస్టోలో నేను వాటన్నింటినీ పెడతాను. మీ అందరి సహకారం అవసరం. మీ దీవెనలతోనే నేను ముందుకు సాగుతాను’ అని వైసీపీ అధినేత జగన్ వీడియోలో చెప్పారు.

బాబు పాలన అంతా అవినీతి మయం....

ఆ తర్వాత జరిగిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. చంద్రబాబు వయసులో తనకు సగం కూడా ఉండదని, అయినా తనను ఇబ్బందిపెట్టాలన్నదే చంద్రబాబు ఆలోచనగా ఉందన్నారు. కాని తనను ఇబ్బంది పెట్టినా నాకు మద్దతిచ్చే అశేష జనాన్ని చూసి వాటన్నింటినీ మర్చిపోతాను. తనను రాజీకీయంగా అణదొక్కేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. అయినా మీ భరోసాతోనే తాను ముందడగు వేస్తున్నానని జగన్ ప్రజలనుద్దేశించి అన్నారు. ఎనిమిదేళ్ల తనతో అడుగు వేసి నడిచిన ప్రతి కుటుంబం రుణాన్ని తాను ఎన్నడూ తీర్చుకోలేనన్నారు. చంద్రబాబు నాలుగేళ్ల పరిపాలనలో అభివృద్ధి శూన్యమన్నారు. రాష్ట్రానికి ఇసుమంతైనా మేలు జరగలేదన్నారు. చంద్రబాబు పరిపాలనలో ఏ ఒక్క కుటుంబమన్నా సంతోషంగా ఉందా అని జగన్ ప్రశ్నించారు. బాబు పాలన అంతా అవినీతిమయం.. అరాచక పర్వాలేనని జగన్ అభిప్రాయపడ్డారు. రైతులు, అక్కచెల్లెల్లు, నిరుద్యోగులు, వృద్ధులు అందరూ చంద్రబాబు చేతిలో మోసపోయారన్నారు. రైతులు ఆత్మహత్యలకు కారణాలేంటో అందరికీ తెలుసునన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. చంద్రబాబు పాలనలో అన్యాయానికి గురవుతున్న ప్రజలకు భరోసా ఇచ్చేందుకే తాను పాదయాత్ర చేపట్టానన్నారు. తన పాదయాత్రలో ప్రతి సామాజిక వర్గాన్ని కలిసి వారి సమస్యలను వింటానని చెప్పారు.

బాబు ఇంగ్లీషు సినిమాలు చూడక.....

చంద్రబాబు మరో మంచి పనిచేశాడన్నారు. అది ఇంగ్లీషు సినిమాలు చూడకపోవడమేనన్నారు. తెలుగు సినిమాలుచూసి అదే సెట్టింగ్ ను ఏపీ అమరావతిలో నిర్మిద్దామంటారు. బాహుబలి తరహా సెట్టింగ్ తో రాజధాని అంటారన్నారు. ఇక ఏ దేశానికి పోతే ఆ దేశం చూసి అక్కడిలాగే మన ఏపీ ఉండాలంటారు. జపాన్ జపాన్ లాగా, సింగపూర్ పోతే సింగపూర్ లాగా ఇలా...ఏదేశానికి పోతే ఆ దేశంలా రాజధానిలా తీర్చిదిద్దుతామని డప్పాలు కొడతారన్నారు జగన్. అయితే అదృవశాత్తూ ఇంగ్లీషు సినిమాలు చూడకపోవడంతో ఏపీ ప్రజలు బతికిపోయారన్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలపై చంద్రబాబు చెప్పేవన్నీ కట్టుకథలేనని జగన్ విమర్శించారు. మొత్తం మీద జగన్ తొలి అడుగులో తొలి ప్రసంగం వైసీపీ శ్రేణులను ఆకట్టుకుంది.

Similar News