జగన్ ఒకటి తలిస్తే... అక్కడ మరొకటి...?

Update: 2017-11-07 07:30 GMT

వైసీపీ అధినేత ఒకటనుకుంటే... మరొకటి జరుగుతుంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో పార్టీని పటిష్టపర్చాలని జగన్ అన్ని జిల్లాలపై దృష్టి పెట్టారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇన్ ఛార్జులను నియమించారు. అయితే విశాఖ జిల్లాలో మాత్రం జగన్ పార్టీ చేస్తున్న వ్యూహం రివర్స్ అయ్యేటట్లుంది. విశాఖ జిల్లాలో గత ఎన్నికల్లో మూడు అసెంబ్లీ స్థానాలను, ఒక పార్లమెంటు స్థానాన్ని గెలుకుంది. ఈసారి ఆ సంఖ్యను మరింత పెంచాలని జగన్ పట్టుదలగా ఉన్నారు. విశాఖ జిల్లాలో పకడ్బందీగా పార్టీని నడిపించేందుకు నేతల కోసం అన్వేషిస్తున్నారు. ఇందుకోసం పాత నేతల పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. విశాఖలోని అరకు పార్లమెంటు నియోజకవర్గాన్ని వైసీపీ గెలుచుకుంది. అయితే అక్కడ వైసీపీ ఎంపీగా గెలిచిన కొత్తపల్లి గీత పార్టీని వీడి వెళ్లిపోయారు.

అరకు వైసీపీలో విభేదాలు....

ఇక అరకు, పాడేరు నియోజకవర్గాల్లో కూడా వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు పసుపు కండువా కప్పుకుని వెళ్లిపోయారు. దీంతో అరకు నియోజకవర్గ పరిశీలకురాలిగా గిడ్డి ఈశ్వరిని నియమించారు. అరకు ఇన్ ఛార్జిగా మాజీ బ్యాంకు అధికారి ఫాల్గుణను నియమించారు. గత రెండేళ్లుగా ఫాల్గుణ అరకు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఫాల్గుణకు గిడ్డి ఈశ్వరి కూడా మద్దతిస్తున్నారు. అయితే ఇటీవల మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబును పార్టీలోకి చేర్చేందుకు వైసీపీలోని కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారు. దీనికి జగన్ కూడా పెద్దగా అభ్యంతరం వ్యక్తం చేయలేదట. అరకు నియోజకవర్గంలో గతంలో జరిగిన ఎన్నికల్లో రవిబాబు టిక్కెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 23 వేల ఓట్లు సాధించారు. దీంతో ఆయనకు ప్రజాబలం ఉందని గుర్తించిన వైసీపీ అధిష్టానం ఆయనను పార్టీలో చేర్చుకోవాలని ప్రయత్నిస్తుంది. కాని ప్రస్తుత ఇన్ ఛార్జి ఫాల్గుణ, పరిశీలకురాలు గిడ్డి ఈశ్వరిలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆ నిర్ణయాన్ని జగన్ కొంతకాలం వాయిదా వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.వాస్తవానికి జగన్ పాదయాత్ర ప్రారంభించక మునుపే రవిబాబు పార్టీలోచేరాల్సి ఉన్నప్పటికీ స్థానిక నేతల అభ్యంతరాల కారణంగానే చేర్చుకోలేదట. మొత్తం మీద జగన్ వ్యూహం కొన్ని చోట్ల పార్టీలోనే అసంతృప్తులు రగిలించేలా ఉన్నాయన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Similar News