జగన్ ఎన్ని దెబ్బలు తిన్నా....?

Update: 2017-12-16 08:30 GMT

వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర చేపట్టి ఇప్పటికి 36 రోజులయింది. ఆయనకు ఈ 36 రోజుల్లో ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. అయినా ఏమాత్రం తగ్గకుండా ముందుకు సాగుతున్నారు. జగన్ పాదయాత్రను ప్రారంభించడంతో అధికార తెలుగుదేశం పార్టీ సహజంగానే కొంత ఆందోళనకు గురయిందనే చెప్పొచ్చు. జగన్ పాదయాత్ర చేస్తే ఖచ్చితంగా ఎంతో కొంత మైలేజీ ఉంటుందన్నది అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ ను మానసికంగా దెబ్బకొట్టేందుకు టీడీపీ అనేక ప్రయత్నాలు చేసింది. ఎమ్మెల్యేలను మళ్లీ పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా జగన్ పాదయాత్ర ప్రభావాన్ని తగ్గించాలని చూసింది. వంతల రాజేవ్వరి, గిడ్డి ఈశ్వరిలను చేర్చుకుంది. అయినా జగన్ దీనిపై పెద్దగా స్పందించలేదు.

శాసనసభ సమావేశాలు....

ఇక ఏపీ శాసనసభలు పాదయాత్ర ప్రారంభమైన తర్వాత పెట్టి కొంత డైవర్ట్ చేయాలని ప్రభుత్వం భావించింది. దాదాపు పదిరోజుల పాటు జరిగిన ఏపీ శాసనసభ సమావేశాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలే మంత్రులను నిలదీసినా పెద్దగా స్పందన రాలేదు. జగన్ పాదయాత్రను కొంత తగ్గించడానికే సొంత పార్టీ ఎమ్మెల్యేల చేతనే విమర్శలు అధినేత చేయించారన్నది అందరికీ తెలిసిందే. దీంతో పాటు వైసీపీ శాసనసభ సమావేశాలను బహిష్కరించడం సరికాదంటూ పెద్దయెత్తున్న ప్రచారం చేసింది. అయినా జగన్ పట్టించుకోలేదు. ఎందుకంటే శాసనసభ సమావేశాలకు వెళ్లినా అక్కడ మాట్లాడే అవకాశమివ్వరన్నది జగన్ పార్టీ వాదన. జగన్ మాటకు కట్టుబడి ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కూడా సమావేశాలకు హాజరుకాలేదు.

కాపు రిజర్వేషన్లు.... పవన్ విమర్శలు....

ఇక పాదయాత్ర ప్రభావాన్ని తగ్గించేందుకు కాపురిజర్వేషన్లను ప్రభుత్వం హడావిడిగా తెచ్చిందన్న విమర్శలూ లేకపోలేదు. కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంజునాథ కమిషన్ నివేదిక ఇవ్వకుండానే మంత్రివర్గం ఆమోదించింది. అసెంబ్లీలో తీర్మానం పెట్టి కేంద్రానికి కూడా పంపారు. కాపు రిజర్వేషన్లతో జగన్ నడక వేగాన్ని తగ్గిద్దామనుకున్న టీడీపీ ప్లాన్ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఇక పవన్ కల్యాణ్ నాలుగురోజులు వచ్చి ఏపీలో హడావిడి చేసి వెళ్లిపోయారు. పవన్ పర్యటనలో వైసీపీ అధినేత జగన్ పైనే విరుచుకుపడ్డారు. టీడీపీని పొగిడేశారు. ఇది కూడా ఏపీలోని అనేకమందికి చర్చగా మారింది. ఇలా జగన్ పాదయాత్ర తీవ్రతను తగ్గించడానికి ఎప్పటికప్పుడు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదనే చెప్పాలి. ఇవేమీ పట్టించుకోకుండా జగన్ తన యాత్రను కొనసాగిస్తున్నారు. అంతేకాదు ఎప్పటికప్పుడు పాదయాత్రలో టీడీపీ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారు. ప్రస్తుతం జగన్ అనంతపురం జిల్లా ధర్మవరం లో పర్యటిస్తున్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాలో ఇప్పటివరకూ పాదయాత్రకు మంచి స్పందన రావడంతో వైసీపీ నేతలు, క్యాడర్ లో ఉత్సాహం నెలకొంది.

Similar News