జగన్ ఈ నొప్పితో బాధపడుతున్నారా?

Update: 2017-11-09 02:30 GMT

జగన్ వెన్నునొప్పితో బాధపడుతున్నారా? అవును. నిజమే. ఈ నెల 6వ తేదీన ప్రారంభించిన ప్రజాసంకల్ప యాత్ర ఈరోజు నాలుగోరోజుకు చేరింది. ఇప్పటికే జగన్ దాదాపు 36 కిలోమీటర్లు నడిచారు. అయితే జగన్ కొంత వెన్నునొప్పితో బాధపడుతుండటంతో ప్రత్యేక వైద్యుడిని తిరుపతి నుంచి రప్పించారని తెలిసింది. తిరుపతి నుంచి వచ్చిన ఫిజియోథెరపిస్టు జగన్ కు విశ్రాంతి సమయంలో చికిత్స చేస్తున్నారు. జగన్ దాదాపు మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయాల్సి ఉంది. యాత్ర ప్రారంభించిన రెండో రోజే జగన్ వెన్నునొప్పి రావడంతో వైసీపీ నేతలు కొంత ఆందోళనకు గురయ్యారు. వెంటనే హుటాహుటిన తిరుపతి నుంచి ఫిజియోథెరపిస్టును పిలిపించారు.

మట్టిరోడ్డు మీదనే నడవాలని.....

జగన్ పాదయాత్ర కోసం ప్రత్యేక షూను వాడుతున్నారు. అయితే తారు రోడ్డు మీద నడవటంతో ఆయనకు వెన్నునొప్పి వచ్చినట్లు వైద్యలు చెప్పినట్లు తెలిసింది. తారు రోడ్డు పక్కనే ఉండే మట్టిరోడ్డు మీద నడిస్తే ఇటువంటి సమస్యలు రావని వైద్యులు సూచించినట్లు వైసీపీ నేతలు చెప్పారు. గతంలో చంద్రబాబు పాదయాత్ర చేసిన సమయంలో కూడా ఆయన మట్టిరోడ్డు మీదనే నడిచారు. కాని జగన్ మాత్రం తొలి రెండు రోజులూ తారు రోడ్డు మీదనే నడిచారు. వేలాది మంది కార్యకర్తలు వెన్నంటి ఉండటంతో ఆయన నడవటం కూడా కష్టంగానే మారింది. దీంతో మట్టిరోడ్డు మీదనే జగన్ నడిచేలా వైసీపీ శ్రేణులు ప్లాన్ చేస్తున్నాయి. జగన్ వెంట ఒక ఫిజియోథెరపిస్ట్ తో పాటు, మరో వైద్యుడిని కూడా ఉంచారు. జగన్ నడకలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కాని ప్రస్తుతం వచ్చిన వెన్నునొప్పితో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని వైద్యులు చెప్పారు.

Similar News