చిన్నమ్మకు కోలుకోలేని దెబ్బ

Update: 2017-11-09 07:30 GMT

దివంతగ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి శశికళ జైలు నుంచి వచ్చే లోపే ఆమె ఆస్తులన్నీ హారతి కర్పూరంలా కరిగిపోనున్నాయి. ఆమెను అష్టదిగ్భంధనంచేసే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో శశికళ బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే శశికళ ఆస్తులను కొన్నింటిని ప్రభుత్వం సీజ్ చేసింది. తాజాగా గురువారం ఉదయం శశికళ ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. జయ టీవీ, నమధు ఎంజీర్ దినపత్రికతో సహా శశికళ వర్గానికి చెందిన నేతల నివాసాల్లో అధికారులు సోదాలు చేపట్టడం తమిళనాడులో సంచలనం కల్గిస్తోంది.

శశికళ ఆస్తులపై ఐటీ దాడులు...

జయ ప్లస్ ఛానెల్ లోని 16 ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. జాజ్ సినిమాస్ కు చెందిన రెండు కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు రైడ్ చేశారు. అలాగే శశికళ సొంత స్థలమైన మన్నార్ గుడి, తంజావూరులోనూ ప్రత్యేక బృందాలు సోదాలు చేస్తున్నారు. శశికళ లక్ష్యంగా సాగుతున్న ఈ దాడుల్లో అనేక అక్రమాస్తులు బయటపడే అవకాశముందని చెబుతున్నారు. టీటీవీ దినకరన్ ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు. శశికళ కుటుంబాన్ని ఇటీవలే పార్టీ నుంచి పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు కలిసి బయటకు పంపిన సంగతి తెలిసిందే. అయితే టీటీవీ దినకరన్ దాదాపు 20 మంది ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టి పళనిస్వామి సర్కార్ కు వ్యతిరేకంగా పావులు కదిపారు. పళని ప్రభుత్వాన్ని కూలదోస్తానని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలోనే ఈ దాడులు జరుగుతున్నట్లు శశికళ వర్గం ఆరోపిస్తోంది. మరోవైపు జయ ఆస్తులన్నింటీని చిన్నమ్మ తన గుప్పిట్లోనే ఉంచుకున్నారు. వాటినికూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. మొత్తం మీద చిన్నమ్మకు ఇది కోలుకోలేని దెబ్బే అని చెప్పవచ్చు.

Similar News