చిన్నమ్మకు కొత్త సీఎం గిఫ్ట్ ఇదే...

Update: 2017-02-19 03:31 GMT

తమిళనాడు ముఖ్యమంత్రిగా విశ్వాస పరీక్షలో నెగ్గిన పళనిస్వామి ఇక బెంగళూరు - చెన్నై తిరిగడటంతోనే సమయం సరిపోతుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. బెంగళూరు పరప్పణ అగ్రహారం జైలులో ఉన్న శశికళను కలుసుకునేందుకు ఈనూతన సీఎం ఖచ్చితంగా ఈ రెండు రాష్ట్రాల మధ్య చక్కర్లు కొట్టాల్సిందే. చిన్నమ్మ సలహా తీసుకోకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయడు పళనిస్వామి. తనను సీఎంగా చేసింది చిన్నమ్మే కాబట్టి ఆమెకు ఒక గిఫ్ట్ ఇవ్వాలని కూడా పళనిస్వామి నిర్ణయించుకున్నారు.ఆమెను చెన్నై జైలు తరలించడమే తన మొదటి కర్తవ్యంగా భావిస్తున్నారు. లేకుంటే పళనిస్వామి నెలలో రెండు,మూడుసార్లు చెన్నై టు బెంగళూరు చక్కర్లు కొట్టాల్సిందే. ఇదే విషయంపై సినీనటుడు సిద్ధార్థ్ కూడా వెటకారంగా ట్వీట్ చేశారు. చిన్నమ్మకు ఒక ల్యాప్ ట్యాప్ కొనిస్తే...పళనిస్వామికి బెంగళూరు -చెన్నై రవాణా ఖర్చులన్నా మిగులుతాయని సిద్ధార్థ్ చేసిన ట్వీట్ వైరల్ అయింది.

చిన్నమ్మ ప్రాణాలకు ముప్పు ఉందట...

బెంగళూరు పరప్పణ అగ్రహారం జైలులో చిన్నమ్మ ప్రాణాలకు ముప్పు ఉందని సమాచారం ఉందట. ఈమేరకు ఇప్పటికే స్పెషల్ కోర్టులో చిన్నమ్మ తరుపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. చిన్నమ్మను ఎలాగైనా చెన్నైకి రప్పించాలని పళనిస్వామి బ్యాచ్ భావిస్తున్నారు. ఆమెను బెంగళూరు జైలులో సాధారణ ఖైదీ లాగా చూడటం, ప్రత్యేక సౌకర్యాలు కల్పించకపోవడంపై మన్నార్ గుడి బ్యాచ్ కూడా కుమిలిపోతోంది. వీలయినంత తొందరగా చిన్నమ్మను చెన్నైకి తీసుకురావాలన్నది వారి లక్ష్యంగా కన్పిస్తోంది. ఇది పళనిస్వామి తొలి టార్గెట్. త్వరలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పళనిభేటీ అయి ఈ విషయంపై చర్చించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చిన్నమ్మ భద్రతను తాము పరిరక్షించలేకపోతున్నామని చెబితే న్యాయస్థానం సులువుగా శశికళను చెన్నై జైలుకు మార్చే అవకాశముందంటున్నారు నిపుణులు. అందుకే ఆ దిశగా పళని పావులు కదుపుతున్నారు. తనను ముఖ్యమంత్రి ని చేసిన చిన్నమ్మను ఎలాగైనా చెన్నైకి తీసుకురావాలని పళని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే న్యాయస్థానం ఇందుకు అంగీరిస్తుందా? లేదా? అన్నది చూడాలి. గతంలో జయలలిత కూడా ఇదే ప్రయత్నం చేసి భంగపడినట్లు న్యాయవాదులు చెబుతున్నారు. చిన్నమ్మ చెన్నైకి రాకుంటే...పళనిస్వామికి చెన్నై టు బెంగళూరు పర్యటనలు తప్పవు.

Similar News