చంద్రబాబుకు పవన్ 48 గంటల డెడ్ లైన్

Update: 2017-01-03 06:21 GMT

కొన్ని దశాబ్దాలుగా ఉద్దానంలో కిడ్నీ వ్యాధితో ప్రజలు మరణిస్తుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. మంగళవారం పవన్ శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులను పరామర్శించారు. వారితో ముఖాముఖీ మాట్లాడారు. ఉద్దానంలో 20 ఏళ్ల నుంచి కిడ్నీ వ్యాధి ప్రబలుతుందని, ఎన్నో కుటుంబాలు అనాధలుగా మారాయని ఆయన ఆవేదన చెందారు. ఈ వ్యాధి గురించి విన్న తాను తీవ్రంగా కలత చెందే ఇక్కడకు వచ్చానని చెప్పారు. ఏ రాజకీయ ప్రయోజనాలు ఆశించో ఇక్కడకు రాలేదని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యను పట్టించుకోకపోవడం విచారకరమని చెప్పారు.

అధ్యయనానికి కమిటీ

శ్రీకాకుళం జిల్లాలోని ఏడు మండలాల్లో ఉన్న కిడ్నీ వ్యాధిగ్రస్తులను జనసేన అధినేత కలుసుకున్నారు. చిన్న పిల్లలు కూడా ఈ వ్యాధి బారిన పడుతుండటం ఆందోళన కల్గింస్తుందన్నారు. ఓట్లు వేయించుకున్న నేతలు ఈ సమస్య పరిష్కారానికి ఇన్నేళ్లుగా ఎందుకు కృషి చేయలేకపోయారని ప్రశ్నించారు. రాజకీయాల్లోకి వచ్చింది ప్రజల చేత ఓట్లు వేయించుకోవడానికి కాదన్న పవన్ ప్రజాసమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వాన్ని నిధులడిగితే లేవంటారని, ఇప్పటికైనా ఉద్దానం సమస్యను పరిష్కరించకుంటే తాను ప్రజా ఉద్యమాన్ని చేపడతానన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికి 48 గంటల సమయం ఇస్తున్నానన్న పవన్, ప్రభుత్వం స్పందించకుంటే స్వయంగా తానే రంగంలోకి దిగుతానని ప్రభుత్వాన్నిహెచ్చరించారు. పవన్ ముఖాముఖి కార్యక్రమానికి కిడ్నీ వ్యాధిగ్రస్థులతో పాటు వేలాది మంది అభిమానులు, జనసేన కార్యకర్తలు తరలి రావడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది. ఉద్దానం సమస్యపై అధ్యయం చేయడానికి పార్టీ తరుపున కమిటీని పవన్ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 15 రోజుల్లో పవన్ కు నివేదిక అందిస్తుంది. ఈ నివేదిక ఆధారంగా పవన్ నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తానని చెప్పారు.

Similar News