'చంద్రన్న బీమా' పథకం ప్రారంభం

Update: 2016-10-02 13:47 GMT

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అసంఘటిత రంగ కార్మికులకు జీవితం పట్ల భరోసా, విశ్వాసం కల్పించే చంద్రన్న బీమా పథకాన్ని చంద్రబాబునాయుడు ఆదివారం నాడు తిరుపతిలో ప్రారంభించారు. తిరుపతి తారక రామా మైదానంలో ఘనంగా జరిగిన కార్యక్రమంలో చంద్రబాబునాయుడు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో తన పేరిట రూపొందించిన కీలకమైన మరో పథకాన్ని ప్రారంభించడం విశేషం. మహాత్మాగాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి వంటి మహనీయులు జన్మించిన రోజున ఇంతటి ప్రజోపయోగకరమైన చంద్రన్న బీమా పథకాన్ని ప్రారంభించడం తాను అదృష్టంగా భావిస్తున్నట్లు చంద్రబాబునాయుడు చెప్పారు.

రాష్ట్రంలో ఉన్న అసంఘటిత రంగ కార్మికుల గణాంకాలను కూడా చంద్రబాబు వివరించారు. వారందరికీ ఈ పథకం కింద లబ్ధి చేకూరుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న రెండుకోట్ల మంది అసంఘటిత రంగ కూలీలకు ఇది లబ్ధి చేకూరుస్తుందని చంద్రబాబు పేర్కొనడం విశేషం.

అలాగే స్వచ్ఛ్‌ ఏపీ కార్యక్రమాన్ని కూడా ఇవాళే ప్రారంభించడం గురించి కూడా చంద్రబాబునాయుడు సభలో ప్రస్తావించారు. మరుగుదొడ్లు లేని గ్రామాలు, ఇళ్లు ఉండకూదంటూ.. ఆడబిడ్డల ఆత్మగౌరవం కోసం మరుగుదొడ్లు తప్పనిసరి అని ఆయన వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో డ్వాక్రా మహిళలు పనుల మీద బయటకు వెళితే.. మగాళ్లు ఇంట్లో ఉండి వంటలు చేసుకునే పరిస్థితి వస్తుందంటూ చంద్రబాబునాయుడు జోకులేయడం విశేషం.

Similar News