ఘనవిజయంతో ప్రపంచ నెం.1 గా భారత్‌!

Update: 2016-10-03 11:35 GMT

న్యూజీల్యాండ్‌ మీద అపూర్వమైన ఘనవిజయాన్ని నమోదుచేయడం ద్వారా భారత్‌ తిరిగి అజేయమైన రీతిలో ప్రపంచంలోనే నెంబర్‌ 1 ర్యాంక్‌ కు చేరుకుంది. భారత పర్యటనలో ఉన్న న్యూజీలాండ్‌ జట్టుతో కోల్‌కత ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన రెండో టెస్ట్‌ మ్యాచ్‌ లో ఏకంగా 178 పరుగుల తేడాతో కోహ్లిసేన విజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్‌ను చేజిక్కించుకోవడం మాత్రమే కాదు.. చేజారిన తమ ప్రపంచ నెంబర్‌ వన్‌ ర్యాంకింగ్‌ కూడా తిరిగి భారత్‌ వశమైంది.

కోల్‌కతలో జరుగుతున్న రెండో టెస్టు ఇంకా ఒక రోజు ఆట మిగిలిఉండగానే.. అభిమానులకు దసరా కానుకలాంటి విజయాన్ని అందించడం విశేషం. సిరీస్‌లో ఇంకా ఒక టెస్టు మ్యాచ్‌ మిగిలి ఉంది. 300 పరుగుల పైచిలుకు లక్ష్యాన్ని న్యూజీల్యాండ్‌ ముందు ఉంచడం ద్వారా సగం ఒత్తిడి పెంచిన టీమిండియా బౌలర్ల ధాటికి సెకండిన్నింగ్స్‌లో న్యూజీలాండ్‌ విలవిల్లాడింది. తొలి ఇన్నింగ్స్‌లోనే పేసర్లను తట్టుకోలేకపోయిన కివీస్‌ ఆటగాళ్లు, సెకండిన్నింగ్స్‌లోనూ ఏ దశలోనూ భారత బౌలర్లకు ఎదురు నిలవలేకపోయారు.

తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి కివీస్‌ పతనాన్ని శాసించిన కుమార్‌ ఈ రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్‌ తీయగా, అశ్విన్‌, షమీ, జడేజాలు తలా మూడేసి వికెట్లు పంచుకున్నారు. వారి జట్టులో ఓపెనర్‌ లాథమ్‌ 74 పరుగులు చేశారు. ఓపెనర్లు ఉన్నంత సేపు ఆట సాగుతు..న్నట్లుగా అనిపించింది గానీ.. ఆ వికెట్లు పడగానే.. అచ్చంగా.. కివీస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పేకమేడలా కూలిపోయింది.

కాన్పూర్‌లో జరిగిన తొలి టెస్ట్‌ అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు చారిత్రాత్మక 500 టెస్ట్‌ కాగా అక్కడ విజయం అందరికీ తెలిసిందే. కోల్‌కత లోని లక్కీ ఈడెన్‌ గార్డెన్స్‌ పిచ్‌పై జరిగిన రెండో టెస్ట్‌ స్వదేశంలో భారత్‌ ఆడుతున్న 250 మ్యాచ్‌గా మరో అరుదైన మ్యాచ్‌ కావడం విశేషం. ఇందులో కూడా భారత్‌ ఘన విజయాన్ని సాధించింది.

Similar News