గుజరాత్ లో గుర్రం.. ఎగరా వచ్చు...!

Update: 2017-11-10 16:30 GMT

గుజరాత్ లో కమలానికి కాంగ్రెస్ కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. గుజరాత్ లోకాంగ్రెస్ బలం క్రమంగా పుంజుకుంటోంది. సర్వేలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గుజరాత్ లో గత ఇరవై ఏళ్లుగా అధికారంలో ఉన్నా తామే తిరిగి పవర్ లోకి వస్తామని బీజేపీ గట్టిగా భావిస్తుంది. అయితే కాంగ్రెస్ క్రమంగా రేస్ లోకి వస్తుండటం కమలనాధులను ఆందోళనకు గురి చేస్తుందనే చెప్పాలి. ఏబీపీ-సీఎస్డీఎస్ సర్వే ఇటీవల కాలంలో రెండుసార్లు చేసింది. ఒకసారి ఆగస్టులోనూ, మరొకసారి అక్టోబరు చివరిలోనూ ఈ సంస్థ గుజరాత్ లో సర్వే చేసింది. అయితే ఆగస్టులో ఈ సంస్థ చేసిన తొలివిడత సర్వేలో బీజేపీకి 59 శాతం, కాంగ్రెస్ కు 41 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది. 59 శాతం ఓట్లు అంటే దాదాపు 140 స్థానాలు బీజేపీకి దక్కుతాయని, కమలం పార్టీదే విజయమని ఆగస్టులో జరిపిన సర్వేలో తేలింది.

రోజురోజుకూ పుంజుకుంటున్న కాంగ్రెస్....

అయితే అక్టోబర్ నెలలో అదేసంస్థ రెండో విడత సర్వేచేసింది. అయితే ఈసర్వేలో కాంగ్రెస్ పార్టీ గుజరాత్ లో అనూహ్యంగా బలం పెంచుకుంది. జీఎస్టీ, నోట్ల రద్దు, అధికారపార్టీ నేతలపై అవినీతి ఆరోపణలు కాంగ్రెస్ కు కలిసి వచ్చేలా ఉన్నాయి. రెండో విడత జరిపిన సర్వేలో బీజేపీ 47 శాతం ఓట్లురాగా, కాంగ్రెస్ కు 41 శాతం ఓట్లు వస్తాయి. అంటే మూడు నెలల్లో బీజేపీ గుజరాత్ లో 12 శాతం ఓట్లను కోల్పోయిందనే చెప్పాలి. గుజరాత్ ఎన్నికలు డిసెంబరు 9వ తేదీన తొలిదశ ఎన్నికలు జరుగుతాయి. అంటే మరో నెల సమయం వరకూ ఉంది. ఈ నెలలో కాంగ్రెస్ మరింత పుంజుకుంటే గుజరాత్ లో కమలనాధులకు భంగపాటు తప్పేలా లేదు. ఇప్పటికే రాహుల్ గాంధీ గుజరాత్ లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. పటేల్ సామాజిక వర్గం నేతలతో చర్చలు దాదాపుగా ఫలించాయనే చెప్పాలి. పటేళ్ల రిజర్వేషన్లపై పార్టీ సీనియర్ నేత కపిల్ సిబాల్ చేసిన సూచనలకు హార్థిక్ పటేల్ కూడా సూత్రప్రాయంగా ఆమోదించినట్లు తెలుస్తోంది. ఎస్సీ, బీసీ వర్గాల నేతలతో కూడా రాహుల్ సమావేశాలను నిర్వహిస్తూ ముందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్ లో ఏమో... గుర్రం.. ఎగరా వచ్చు...?

Similar News