గుంటూరు మిర్చి...హాట్ లేదు...గురూ...

Update: 2017-03-05 16:23 GMT

గుంటూరు మిర్చి ఘాటు తగ్గింది. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడి పోతున్నారు. వర్షాలు లేక అతి కష్టం మీద పండించిన మిర్చికి సరైన ధర రావడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిర్చి పంటను ఎందుకు వేశామా అని రైతన్నలు డీలా పడిపోతున్నారు. గుంటూరు మిర్చి యార్డులో సరైన ధర పలకక, అటు అక్కడ ఉంచుకోలేక, ఇటు అమ్ముకోలేక రైతన్నలు అవస్థలు పడుతున్నారు.

దారుణంగా పడిపోయిన ధరలు....

కేవలం వారం రోజుల వ్యవధిలోనే మిర్చి ధర దారుణంగా పడిపోయింది. క్వింటాల్ కు మూడు వేల నుంచి ఏడు వేల రూపాయలకు పడిపోవడంతో రైతులకు సాగు ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి కన్పించకుంా పోయింది. గత ఏడాది మిర్చి ధర బాగా పలకడంతో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో రైతులు వేలాది ఎకరాల్లో మిర్చి పంటను వేశారు. అయితే మిర్చి సీజన్ ప్రారంభానికి ముందే ధర పతనం అవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లారు. దీనికి అనేక కారణాలు చెబుతున్నారు. మిర్చి లోడ్లు యార్డుకు అధికంగా రావడం ఒక కారణమైతే, మిర్చి డిమాండ్ కూడా బాగా తగ్గిందంటున్నారు. పెద్ద నోట్ల రద్దుతో పాటుగా బ్యాంకులు విధిస్తున్న ఆంక్షలను కూడా వ్యాపారులు సాకుగా చూపుతున్నారు. కాని కమీషన్ ఏజెంట్లు, ఎగుమతిదారులు కుమ్మక్కై రైతు నోట్లో కారం కొడుతున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. గుంటూరు మిర్చి యార్డుకు కేవలం ఏపీ నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక నుంచి మిర్చిని తీసుకొస్తారు. సాధారణంగా ఫిబ్రవరి నుంచి మిర్చి విక్రయాల సీజన్ స్టార్ట్ అవుతుంది. అయితే పంట ముందుగానే రావడంతో జనవరి నుంచే యార్డుకు మిర్చిని తీసుకొస్తున్నారు రైతులు. నాలుగు రోజుల క్రితం క్వింటాల్ తేజ రకం మిర్చి రూ.9,500లు ఉండగా, అది ఎనిమిది వేలుకు పడిపోయింది. సరుకు ఎక్కువ వచ్చే కొద్దీ వ్యాపారులు ధరను కావాలని తగ్గిస్తున్నారని రైతులు చెబుతున్నారు. గత ఏడాది మిర్చి ధర పదివేలకు పైగానే పలికింది. తేజ రకం మిర్చి అయితే క్వింటాల్ రూ.14 వేలు కు కొనుగోలు చేశారు. ఏటా గుంటూరు యార్డుకు కోటి బస్తాల మిర్చి వస్తుంటుంది. ఈ ఏడాది మరో యాభై వేల బస్తాలు అదనంగా వచ్చే అవకాశముంది. మర్చి పంట ఎక్కువగా పండటంతోనే వ్యాపారులు నాణ్యత ఉన్న మిర్చిని కూడా ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని రైతులు కోరుతున్నారు

Similar News