కోదండరామ్ పై జేఏసీ నేతల ఫైర్

Update: 2017-03-08 11:30 GMT

కోదండరామ్ ఏకపక్ష ధోరణిని అవలంబస్తున్నారని టీజేఏసీ నుంచి సస్పెండ్ అయిన నేతలు ప్రకటించారు. సమావేశంలో టీజేఏసీ మాజీ నేతలు పిట్టల రవీందర్, తన్వీర్ సుల్తానా, ప్రహ్లాద్ లు మాట్లాడారు. టీజేఏసీలో ఈ పరిస్థితి రావడం చాలా బాధాకరమన్నారు. తమను అవమానించి కోదండరామ్ సామాజిక న్యాయం ఎలా చేస్తారని ప్రశ్నించారు. టీజేఏసీలో మహిళలకు అవమానం జరుగుతుందన్నారు. తమ వెనుక ప్రభుత్వం ఉందని అనవసర ఆరోపణలు చేస్తున్నారని, ప్రభుత్వంతో కలిసి పోవాలనుకుంటే రెండేళ్లు జేఏసీలో ఎందుకు పనిచేస్తామని వారు ప్రశ్నించారు. టీజేఏసీ అనేది రిజిస్ట్రర్డ్ సంస్థ కాదని, టీజేఏసీని ఒకరు ఏర్పరచినది కాదని, దానికి ఓ విధి విధానాలు కూడా లేవని వారు చెప్పారు. ఉద్యమంలో సమన్వయం కోసమే కోదండరామ్ ను ఎన్నుకోవడం జరిగిందన్నారు. నిరుద్యోగ నిరసన ర్యాలీ తర్వాత దానిపై చర్చించకుండా సుధీర్ కమిటీ రిపోర్ట్ పై 15 రోజుల జిల్లా పర్యటనను ఎలా ప్రకటిస్తారన్నారు. కోదండరామ్ పొలిటికల్ సైన్స్ చదివి ఉంటారని భావిస్తున్నామని, ఆయన ఏ గడప తొక్కుతున్నారో? ఎక్కడి నుంచి సూట్ కేసులు వస్తున్నాయో తమకు తెలుసునన్నారు.

వీకెండ్ నేతలే...

తెలంగాణకు బద్ధ వ్యతిరేకి అయిన సీపీఎం నేత తమ్మినేని వీరభధ్రంతో కోదండరామ్ ఎలా చేతులు కలుపుతారని వారు ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని కుట్రలతో కూల్చివేయాలనుకోవడం నేరమని కోదండరామ్ కు తెలియదా? అని వారు ప్రశ్నించారు. కేసీఆర్ తర్వాత తనకే బలం ఉందని కోదండరామ్ భావిస్తే పార్టీ పెట్టుకోవడంలో తప్పులేదన్నారు. అయితే జేఏసీలో చర్చించకుండా పార్టీ పెడతామని చెప్పటం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. విదేశాలకు వెళ్లినప్పుడు కోదండరామ్ ఎవరెవరిని కలిశారో తమకు తెలుసన్న నేతలు కోదండరామ్ సొంత ప్రచారానికే ఎక్కువ విలువిస్తారన్నారు. ప్రస్తుతం జేఏసీలో ఉన్నదంతా వీకెండ్ నేతలనేని వారు ఎద్దేవా చేశారు.

Similar News