కోడిపందేల బెట్టింగ్ ఎంతో తెలుసా?

Update: 2017-01-15 03:46 GMT

పోలీసులు ఆంక్షలు పనిచేయడం లేదు. కోర్టు ఆదేశాలు లెక్క చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్ లో కోడిపందేలు, జల్లికట్టు క్రీడలు జోరుగా సాగుతున్నాయి. పందెంరాయుళ్లు చట్టం కళ్లకు గంతలు కట్టి మరీ కోళ్ల కాళ్లకు కత్తులు కడుతున్నారు. పోలీసులు చోద్యం చూస్తున్నారు.

కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి ఒక్క రోజే వంద కోట్లకు పైగా బెట్టింగ్ లు జరిగాయి. కోళ్లకు కాళ్లకు కత్తులు కట్టకుండా క్రీడను జరుపుకోవాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా బేఖాతరు చేస్తున్నారు. పశ్చిమ గోదావరిలో దాదాపు వంద బరుల వరకూ ఉన్నాయి. కోడిపందేలను వీక్షించడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజల తరలి వచ్చారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు బరుల వద్ద నిల్చుని మరీ కోడి పందేలను వీక్షించారు పోలీసులు చేష్టలుడిగి చూడటం తప్ప ఏమీ చేయలేక పోతున్నారు. ఆదివారం కనుమ కావడంతో ఈ ఒక్క రోజే కోట్ల రూపాయలు బెట్టింగ్ లు జరిగే అవకాశం ఉంది.

జల్లికట్టుకు సిద్ధం...

ఇక చిత్తూరు జిల్లాలో జల్లికట్టుకు అంతా సిద్ధమైంది. చిత్తూరు జిల్లాలోని రంగంపేటలో జల్లికట్టుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలీసులు పశువుల యజమానులకు నోటీసులు జారీ చేసినా ఫలితం లేదు. తాము పశువుల పండగ మాత్రమే జరుపుకుంటున్నామని చెబుతున్నారు. పోలీసులు కేసులు పెడతామన్నా పెద్దగా పట్టించుకోకుండానే జల్లికట్లుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. మొత్తం మీద ఏపీలో పందెంరాయుళ్లు రెచ్చిపోపతున్నారు.

Similar News