కొన్నాళ్లు నీళ్ల గురించి తిట్టుకోవడం ఆగొచ్చు...

Update: 2016-10-02 06:00 GMT

'ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డి పాడు నుంచి దొంగతనంగా నీళ్లు తరలించి తీసుకువెళుతోంది', 'శ్రీశైలం నుంచి దొంగతనంగా ఎక్కువ నీళ్లు తీసుకుంటున్నారు', 'శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌ కు కావాలనే నీళ్లు విడుదల చేయడం లేదు' కొన్ని రోజులుగా ఇలాంటి జలవివాదాల కామెంట్లు వినిచూసి ప్రజలు ఒక రకమైన నిస్పృహలో ఉన్నారు. కొత్తగా ఏర్పడిన రెండు తెలుగు రాష్ట్రాల మద్య హద్దుల వెంబడి ఉమ్మడిగా ఉన్నదే శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్టులు అయినప్పుడు వాటి పేరిట ఎంత రగడ జరుగుతూ ఉన్నదో జనం గమనిస్తున్నారు. ఇలాంటి వివాదాలు సమసిపోవాలని రెండు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు. రాజకీయ నాయకుల ఆశలు ఎలాగైనా ఉండొచ్చు గాక!

అయితే ప్రజల ఆకాంక్షల్ని ప్రభుత్వాలు కాదు గానీ.. ప్రకృతి తీర్చబోతున్నది. భారీ వర్షాల కారణంగా రెండు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు అన్నీ నిండాయి. ఇప్పుడు వరద జలాలు ప్రాజెక్టులకు పోటెత్తుతున్నాయి. ఎక్కడినుంచి ఎవరు ఎంత మోతాదులో నీళ్లు దొంగిలించుకున్నారని కామెంట్లు చేసే పరిస్థితి లేదు. నీళ్లను ప్రాజెక్టులే యథేచ్ఛగా వదిలేయాల్సిన పరిస్థితి వస్తోంది.

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. ఇన్‌ ఫ్లో కంటె అవుట్‌ ఫ్లో మోతాదు పెంచి ఇబ్బంది ఎదురవకుండా ఇంజినీర్లు చర్యలు తీసుకుంటున్నారు.

Similar News