కేసీఆర్ సొంత జిల్లాలో అసంతృప్తి సెగలు...!

Update: 2017-11-08 01:30 GMT

ముఖ్యమంత్రి సొంత జిల్లాలో జల జగడాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకూ రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలను చూశాం. విన్నాం. కాని నేడు తెలంగాణలో జిల్లాల మధ్య జలజగడాలను చూడాల్సి వస్తోంది. కేసీఆర్ సర్కార్ తీసుకున్న నిర్ణయం కారణంగా ఆయన సొంత జిల్లా మెదక్ రైతులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. సింగూరు జలాలను శ్రీరాం సాగర్ కు ప్రభుత్వం తరలించడాన్ని మెదక్ జిల్లావాసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు మంజీరా నది నుంచే నీటి లభ్యత ఉంది. మంజీరా నదిపై పుల్కల్ మండలం వద్ద సింగూరు జలాశయాన్ని నిర్మించారు. సింగూరు జలాశయం సామర్థ్యం 30 టీఎంసీలు. సింగూరు జలాశయం నుంచి హైదరాబాద్ కే కాకుండా మెదక్ జిల్లా వాసుల తాగునీటి అవసరాలకు, సేద్యానికి సాగునీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్టు నిర్మించి మూడు దశాబ్దాలవుతున్నా తొలిసారి గత ఏడాది ప్రభుత్వం ఈ జిల్లాలో సాగునీటిని విడుదల చేసింది. 30 వేలకు పైగా ఎకరాల్లో రెండో పంటకు నీరందించడంతో రైతులు ఆనందం కూడా వ్యక్తం చేశారు. కాని అకస్మాత్తుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతులు దిగాలు పడ్డారు.

శ్రీరాంసాగర్ కు నీటి విడుదలపై.....

గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు సింగూరు జలాశయం కళకళలాడింది. పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. దీంతో రబీలో రైతాంగానికి అవసరమైనంత నీటిని ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఇప్పుడు ఉన్న నీటిలో 15 టీఎంసీలను శ్రీరాం సాగర్ జలాశయానికి విడుదల చేయాలని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. సింగూరు నుంచి రెండు గేట్లు ఎత్తి శ్రీరాంసాగర్ కు నీటిని విడుదల చేశారు అధికారులు. ఎస్సార్ ఎస్పీకి నీటిని తరలిస్తే సింగూరు జలాశయంలో మిగిలేది ఇక పదిహేను టీఎంసీలే. వీటిలో మూడు టీఎంసీలు ఘనాపూర్ ఆయకట్టుకు వదలాలి. ఐదు టీఎంసీలు వాటర్ గ్రిడ్ కు వాడాల్సి ఉంది. ఇక మిగిలేది ఏడు టీఎంసీలే. ఇందులో ఐదు టీఎంసీలు డెడ్ స్టోరేజీ. ఇక రెండు టీఎంసీలనే తాము వాడుకోవాల్సి ఉంటుందని మెదక్ ప్రాంత వాసులు చెబుతున్నారు. తమ అవసరాలను తీర్చకుండా పొరుగు జిల్లాకు నీటిని తరలించడమేంటని ప్రశ్నిస్తున్నారు. అయితే శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ఇప్పటికే 53 టీఎంసీల నీటి నిల్వ ఉంది. అక్కడ ప్రజల కోసం మాత్రం ప్రభుత్వం వదలడం లేదంటున్నారు. ఎస్సార్ఎస్పీ నుంచి కాళేశ్వరానికి తరలించి ట్రయల్ రన్ వేయడానికే ఈ నీటిని విడుదల చేశారంటున్నారు. దీంతో మెదక్ జిల్లాలో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. విపక్షాలు కూడా దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.

Similar News