కేసీఆర్ రూటే... వేరప్పా...!

Update: 2017-11-08 06:30 GMT

తెలంగాణ అసెంబ్లీ పనిదినాలపై ఇంకా క్లారిటీ రాలేదు. తొలుత యాభై రోజుల పాటు సభను నిర్వహిస్తామని చెప్పిన అధికార పక్షం ఇంతవరకూ అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో సభ ఎన్ని రోజులు నడిచేది ప్రతిపక్షాలకు తెలియడం లేదు. మరోవైపు అధికార పార్టీ ప్రతిపక్షాలపైనే తప్పు ఎత్తి చూపే విధంగా ప్లాన్ చేస్తోంది. మంగళవారం నిర్వహించిన బీఏసీ లోనూ సభపై క్లారిటీ రాలేదు. ఈ నెల 17వ తేదీ వరకూ సభ అజెండాను మాత్రమే బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. అయితే విపక్షాలు అడిగితే తాము ఎన్ని రోజులు సభను జరిపేందుకైనా సిద్ధంగా ఉన్నామని అధికార పక్షం చెబుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే వచ్చే బడ్జెట్ సమావేశాలకు కంటిన్యూగా సభ జరుపుదామని చెప్పారు. కేసీఆర్ వ్యూహంలో విపక్షాలు చిక్కుకుపోయాయి.

విపక్షాల నుంచే డిమాండ్ రావాలని....

అయితే కాంగ్రెస్ మాత్రం అన్ని రోజులు సభ జరిపేందుకు ఇష్టంగా లేన్నట్లు తెలుస్తోంది. సభలో తమకు అవకాశం ఇవ్వకపోవడం, దీనివల్ల తాము పార్టీ కార్యక్రమాలను చేపట్టకపోవడం వల్ల సభను వీలయినన్ని తక్కువ రోజులు జరపాలని కోరుకుంటుంది. బీజేపీ కూడా అదే ఆలోచనలో ఉంది. ఎంఐఎం అయితే మరో పది రోజులు చాలు అనే పరిస్థితికి వచ్చింది. అధికార పక్షం మాత్రం విపక్షాలు ఎప్పటి వరకూ జరపమంటే అప్పటి వరకూ తాము సభను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని బంతి వారి కోర్టులోకే వదిలేసింది. ఇది ఒకరకంగా విపక్షాలను ఇరుకున పెట్టేందుకే. తాము సభను ఎన్నిరోజులైైనా నిర్వహించి ప్రజాసమస్యలపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, విపక్షాలు పారిపోయాయన్న సంకేతాలను ప్రజల్లో పంపేందుకే ఈ ఎత్తుగడ వేసింది. ఈరోజు సభ ఎన్నిరోజులు జరపాలన్న దానిపై క్లారిటీ వచ్చే అవకాశముంది. గతంలో సభను ఎక్కువ రోజులు నిర్వహించాలంటూ విపక్షాలు డిమాండ్ చేసేవి. కాని ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ప్రభుత్వం వ్యూహత్మకంగా వ్యవహరించి పనిదినాలు తగ్గించాలని విపక్షాలు కోరే విధంగా పరిస్థితిని తీసుకొచ్చింది. కేసీఆర్... మజాకానా...?

Similar News