కేటీఆర్‌ బాధ్యత లేని ప్రకటన

Update: 2016-09-22 11:34 GMT

భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాదు నగరం అతలాకుతలం అయిపోతున్నది. జనజీవనం కొన్ని రోజులుగా నానా యాతనలకు గురవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. నగరంలో పనుల మీద బయటకు వచ్చి తిరిగి సకాలంలో ఇంటికి వెళ్లడం అనేది అనూహ్యమైన సంగతిగా మారిపోయింది. జనం ఇన్ని అవస్థలు పడుతూ ఉండగా.. అధికారులు తమకు చేతనైనంత మేర జాగ్రత్తలు సహాయక చర్యలు తీసుకుంటూ ఉన్నారు.

ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ మునిసిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ కూడా స్వయంగా రంగంలోకి దిగారు. వర్షాల బాధిత ప్రాంతాల్లో ఆయన గురువారం పర్యటించారు. ప్రజలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. అంతవరకు అభినందించాల్సిందే.

అయితే కేటీఆర్‌ ఈ సందర్భంగా చెప్పిన కొన్ని మాటలు మాత్రం బాధ్యతాయుతంగా లేవని అనుకోవాల్సి వస్తోంది. ఇలాంటి వర్షాల సమయంలో అధికారులకు ప్రజలు సహకరించాలని కేటీఆర్‌ పిలుపు ఇచ్చారు. భాగ్యనగరం రూపురేఖలు మార్చాలంటే.. 20వేల కోట్లు అవసరం అవుతాయంటూ.. మరో స్టేట్‌మెంట్‌ కూడా ఇచ్చారు. అంటే ఇదేదో తమ బాధ్యతను తప్పించుకోవడానికి ఇచ్చిన ప్రకటనల్లా ఉన్నాయి.

కేవలం హైదరాబాద్‌ నగరంలో మురుగునీటి ప్రవాహాలు వెళ్లే అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థలు సరిగా లేకపోవడం వల్ల.. చిన్నపాటి వర్షం వచ్చినా నగరం మడుగులా మారుతుందనేది కొన్ని దశాబ్దాలుగా అందరికీ తెలుసు. అయితే ఈ రెండున్నరేళ్ల వ్యవధిలో ఈ లోపాన్ని చక్కదిద్దడానికి కొత్త తెరాస ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నదో ఆయన చెప్పి ఉంటే బాగుండేది.

లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ 48- 72 గంటల పాటూ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కూడా కేటీఆర్‌ పిలుపు ఇచ్చారు. లోతట్టు ప్రాంతాలంటే.. దాదాపుగా మురికివాడలు, పేదలు నివసిస్తున్న కాలనీలే ఇప్పుడు అధికంగా ముంపు బారిన పడుతున్న వాటిలో ఉన్నాయి. మరి వారు ఇంటినుంచి బయలుదేరి పనికి వెళ్లడానికే దిక్కులేని పరిస్థితి ఉంది. సురక్షిత ప్రాంతాలంటూ వారు ఎక్కడికి తరలి వెళ్లగలరు. ఆయా చోట్ల సహాయ చర్యలు తప్ప.. మెట్ట ప్రాంతాల్లో సురక్షిత షెల్టర్లను ప్రభుత్వం ఈ కొన్ని రోజుల పాటూ నిర్వహించి.. లోతట్టు ప్రాంతాల ప్రజలను తామే అక్కడికి తరలించే ఏర్పాటు ఏమైనా చేస్తున్నదా? అదేమీ జరగడం లేదు. ఆపద వచ్చినప్పుడు ఆదుకోవడంలో ప్రభుత్వాలు ముందుండాలి. ఆపదలో ఉన్నవారికి సలహాలు మాత్రం అందిస్తే.. ఎలా ఉంటుంది? అది బాధ్యత గల వ్యవహారం ఎలా అవుతుంది?

Similar News